అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చిన సేవల సంఖ్య రెండు వందలకు చేరుకుంది. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కోసం ” మన మిత్ర ” పేరుతో దేశంలోనే తొలిసారి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రారంభించింది. అన్ని రకాల సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు, రెవిన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డుల సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా ప్రజలు పొందేలా ఏర్పాట్లు చేశారు.

తొలివిడతలో 161 సేవలను అందుబాటులోకి
తాజాగా కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు, ఇతర ప్రభుత్వ చెల్లింపులు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. తొలివిడతలో 161 సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ సేవలను 200 కు పెంచింది.ఈ 200 సేవలతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ” మన మిత్ర ” సేవల వాట్సాప్ నెంబర్ 95523 00009. ఈ నెంబర్ హాయ్ అని మెసెజ్ చేస్తే ఈ సర్వీస్ ఉపయోగించుకోవడం ఎంత సులువో అర్థమైపోతుంది.
సేవ్ చేసుకోని వాళ్లు కూడా సేవలు పొంద వచ్చు
ఈ వాట్సాప్ సేవలు పొందాలంటే ముందుగా 9552300009 నెంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నెంబర్‌కు వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ చేస్తే రిప్లై వస్తుంది. దాని ఆధారంగా మీకు కావాల్సిన సేవలు పొందవచ్చు. సేవ్ చేసుకోని వాళ్లు కూడా సేవలు పొంద వచ్చు. వాట్సాప్‌లో నెంబర్ సెర్చ్ దగ్గర మీ నెంబర్ టైప్ చేయండి. తర్వాత మీ నెంబర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు మీరే మెసేజ్ పంపించుకోవచ్చు. అలా మీకు మీరే నెంబర్ పంపించుకుంటే దానిపై క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. చాట్ విత్ 9552300009 అని వాయిస్ కాల్ విత్ 9552300009 అని యాడ్ కాంటాక్ట్ అని కూడా వస్తుంది.