AP Govt : ప్రజలకు ఎంపీలు, ఎమ్మెల్యేలను మరింత చేరువ చేసేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవరైతే ప్రజా సమస్యలు తెలుసుకుని వారి కోసం అసెంబ్లీలో, పార్లమెంట్‌లో పోరాటం చేస్తారో వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీలకు అతీతంగా ఈ అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపింది. ఏ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినా సరే ప్రజల వద్దకు వెళ్లాలని కోరింది. ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత దగ్గరవుతారని, ప్రజల సమస్యలను అసెంబ్లీ, పార్లమెంట్‌కు వినిపిస్తారని భావిస్తోంది.

విజేతల ఎంపిక కోసం ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఇందులో భాగంగా సభలో సభ్యుల పనితీరు, వారి ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని అవార్డు అందజేయనుందని తెలుస్తోంది. కాగా, విజేతల ఎంపిక కోసం ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఎంపిక చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు అవార్డులు అందిస్తారని సమాచారం. ఇక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పితే ‘ఉత్తమ లెజిస్లేచర్’, అదే పార్లమెంట్లో అయితే ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ తరహాలో అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
మరిన్ని ప్రజా సేవలపై దృష్టి
ఈ అవార్డుల కార్యక్రమం మార్చి నెలాఖరులో జరిగే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో భారీగా నిర్వహించే ఈ వేడుకలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని కొనియాడే అవకాశం ఉంది. ప్రజల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ అవార్డులు తీసుకోవడం ద్వారా నేతలు తమ పనితీరును మెరుగుపరచుకుంటూ మరిన్ని ప్రజా సేవలపై దృష్టి పెడతారు.