అమరావతి: ఈనెల 17న మరోసారి ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరుగనుంది. కేబినెట్ సమావేశం నేపథ్యంలో తమ ప్రతిపాదనలను జనవరి 16వ తేదీ లోపు పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేసారు.

ఇక ఈ సమావేశంలో ప్రధానంగా గీత కార్మికుల కులాలకు మద్యం షాపుల కేటాయింపు, మద్యం ధరలపై చర్చించనున్నట్టు సమాచారం. జనవరి 18న సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు బయలు దేరి వెళ్లనున్నారు. అక్కడ జరుగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొననున్నారు. దావోస్ పర్యటన గురించి కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 2వ తేదీన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 14 కీలక అంశాలపై చర్చించి మంత్రి మండలి ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.
కాగా, ఈ నెల 2న ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 14 కీలక అంశాలపై చర్చించి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో రూ.2,733 కోట్ల విలువైన పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.