ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ఈ కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
విద్యాశాఖ ప్రతిపాదించిన మార్పులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
క్యాబినెట్‌లో చర్చించిన ప్రధాన విషయాల్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు కూడా ఒకటి. ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదించిన మార్పులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకొచ్చిన ప్రతిపాదనలూ ఆమోదం పొందాయి. రాష్ట్రంలోని వైద్య సేవలను మెరుగుపరిచేందుకు 372 సివిల్ సర్జన్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

మరోవైపు, మద్యం దుకాణాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు న్యాయం చేయాలనే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో, సొండి కులాలకు నాలుగు మద్యం దుకాణాలను కేటాయించాలనే ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. ఇదే విధంగా, చిత్తూరు జిల్లా కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక, ఆమోదం పొందిన ఇతర కీలక నిర్ణయాల్లో..
- రాజమండ్రిలో అగ్రికల్చర్ కాలేజీకి ఉచిత భూమి కేటాయింపు
- రాజమండ్రిలోని ఓల్డ్ హేవ్ లాక్ బ్రిడ్జి అభివృద్ధికి 116 ఎకరాల భూమి కేటాయింపు
- రాష్ట్ర టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం
- సీతంపేట ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ఉచిత భూ కేటాయింపు
- డీపీవోల క్యాడర్ క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు ఆమోదం
- పౌర సేవలు ప్రజలకు మరింత సమర్థవంతంగా అందేలా మార్పులకు గ్రీన్ సిగ్నల్
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుకల్పిస్తాయని మంత్రివర్గ సభ్యులు అభిప్రాయపడ్డారు.