కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు న్యూఢిల్లీలో భారత్ మండపం (Bharat Mandapam in New Delhi)లో భారీ ఈవెంట్ నిర్వహించనుంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా-2025’ (World Food India-2025)పేరుతో జరగనున్న ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామిగా పాల్గొంటుంది.ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ, ఏపీ కూడా ఈ వేదికపై తన ప్రత్యేకతను చాటాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఆధారిత శ్రేణులను ప్రపంచానికి చూపించేందుకు ఇదొక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు.

విశిష్టతల ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ముడి పదార్థాల లభ్యత, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాల వివరాలు ప్రదర్శించనుంది. రాష్ట్రానికి ఉన్న వ్యవసాయ వనరుల ప్రభావాన్ని, పరిశ్రమలకు దోహదపడే అంశాలను ఈ వేదికపై ఆవిష్కరించనుంది. దీని ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి నోడల్ బాధ్యత
ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి రూ.1.271 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేసింది. ఈ నిధులను వినియోగిస్తూ రాష్ట్రం తరపున stall లు, ప్రొడక్ట్ డెమోస్, ప్రెజెంటేషన్లు నిర్వహించనున్నారు.
అంతర్జాతీయ వేదికపై ఏపీకు అవకాశాల వేదిక
వరల్డ్ ఫుడ్ ఇండియా-2025 వేదికలో పాల్గొనడం ద్వారా ఏపీకి అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచం ముందుంచే ఈ వేదికలో రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Read Also : Indian Food : వడాపావ్, సమోసా, జిలేబీలపై కేంద్రం కీలక నిర్ణయం