ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య జరిగి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కేసు ఇంకా న్యాయ పరిష్కారం దిశగా సాగుతూనే ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు వ్యక్తులు కోర్టులో బెయిల్ పొందగా, వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి వారిపై న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనీ పిటిషన్
గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిపై ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టి అరెస్ట్ చేసింది. అయితే ఆయన కోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఆ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన పాత్రపై సందేహాలు వ్యక్తం చేస్తూ, “ఇలాంటి కేసులో మీకు బెయిల్ ఎందుకు ఇవ్వాలి?” అనే ప్రశ్నను లేవనెత్తింది. సునీత తరఫు న్యాయవాది ఇచ్చిన సమాచారం మేరకు, హత్య అనంతరం గాయాల్ని దాచేందుకు కుట్లు వేసి గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కూడా ఉన్నారని తెలిపారు.
వివేకా హత్య కేసులో మరిన్ని కీలక విషయాలు
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ, బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ పిటిషన్‌ను మిగిలిన నిందితులు, ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లతో కలిపి విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యలతో వివేకా హత్య కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూడనున్నట్టు భావిస్తున్నారు.