తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల్లో రాష్ట్రాభిమానం పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ను, తెలంగాణ తల్లి చిత్రాన్ని పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర భావజాలాన్ని విద్యార్థులలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నుండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాల్లో ఈ కొత్త మార్పులు అమలు కానున్నాయి. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు రాష్ట్రగీతం, తెలంగాణ తల్లి ఫొటో కూడా చేర్చడం ప్రత్యేకతగా మారనుంది.
ఈ నిర్ణయంపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ..”2025-26 విద్యాసంవత్సరానికి పాత సిలబస్ కొనసాగుతుందని, 2026-27లో కొత్త సిలబస్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది” అని తెలిపారు. కొత్త సిలబస్‌లో రాష్ట్ర చరిత్ర, సంస్కృతి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రగీతం, తెలంగాణ తల్లి ఫొటో విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో ఈ చర్య ఒక పెద్ద అడుగు అని చెబుతున్నారు. విద్యార్థులు రాష్ట్ర చరిత్ర, సంప్రదాయాల పట్ల మరింత అవగాహనతో ఎదుగుతారని ఆశిస్తున్నారు. ఈ కొత్త మార్పులు ప్రభుత్వ తీరును ప్రతిబింబిస్తాయని, విద్యావ్యవస్థలో తెలంగాణ ప్రత్యేకతను నిలబెట్టే దిశగా ఇది ఒక ముఖ్యమైన ప్రయత్నమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.