పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు
అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత ఐదేళ్లూ మిన్నకుండిపోయిన బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కేసు పెట్టారు. గన్నవరం శివారు మర్లపాలెంలో సుమారు 18 ఎకరాల్లో పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15 మంది గ్రామస్థులు గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు.

అభివృద్ధి చేస్తామంటూ ఆ భూమిని స్వాధీనం
2023లో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తన అనుచరులతో కలిసి భూములను ఖాళీ చేయాలని రైతులపై ఒత్తిడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రజల ఉపయోగం కోసం చెరువును అభివృద్ధి చేస్తామంటూ ఆ భూమిని స్వాధీనం చేసుకొని.. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారు. చెరువు భూమికి ప్రత్యామ్నాయంగా రైతులకు వేరే చోట భూమి ఇస్తామని తొలుత చెప్పి.. తర్వాత దగా చేశారు. దీనిపై మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ణ మంగళవారం రాత్రి గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏ1గా వల్లభనేని వంశీని, ఏ2గా అనగాని రవి, ఏ3గా రంగా, ఏ4గా శేషు, ఏ5గా మేచినేని బాబు పేర్లను చేర్చి కేసు నమోదు చేశారు.