ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన హామీల్లో ఉద్యోగాల కల్పన కూడా ఒకటి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కూటమి పార్టీలు.. ఇప్పుడు వాటిపై దృష్టిసారించాయి. ఇందులో భాగగా ఇవాళ జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో యువతకు 20 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మూడవ రాష్ట్ర పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఇందులో 15 ప్రాజెక్టులకు సంబంధించి కీలక పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ అక్షరాలా రూ.44,776 కోట్లు. ఈ మేర పెట్టుబడుల్ని ఆమోదిస్తూ ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు కల్పన జరగబోతోంది. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్ధాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి సిఎం సూచించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తి కరంగా ఉందని అభిప్రాయ పడ్డారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని వారికి తెలిపారు.