ఏపీ సచివాలయంలో 2వ బ్లాక్‌లో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ రూమ్ పూర్తిగా దగ్ధమైంది.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుని పరిశీలించారు. ఆయనతో పాటు చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోం మంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ- ఈ అగ్నిప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అగ్నిప్రమాదానికి అసలు కారణాన్ని వెల్లడిస్తాం. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో కూడా దర్యాప్తు జరుగుతోంది. అన్ని బ్లాక్స్‌ను పరిశీలించి అగ్నిప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడతాం.
ముఖ్యమైన బ్లాక్‌లోనే ప్రమాదం!
అగ్నిప్రమాదం డిప్యూటీ సీఎం, హోం మంత్రి, ఆర్థిక మంత్రి ఉన్న కీలక బ్లాక్‌లో జరగడం గమనార్హం. దీనిపై అనిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంటలు అంటుకునే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ మెషనరీ సక్రమంగా పని చేస్తున్నదా?, సిబ్బందికి తగిన అవగాహన ఉందా? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సెక్రటేరియట్ భద్రతపై ఆందోళన
ఈ ఘటన నేపథ్యంలో సచివాలయంలో భద్రతా ప్రమాణాలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అలారమ్ లు సక్రమంగా పని చేయలేదని నివేదికల్లో పేర్కొనడం, సిబ్బంది తక్షణ స్పందన కొంత ఆలస్యం కావడం భద్రతా లోపాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం వెనుక ఎలాంటి అజాగ్రత్తలు జరిగాయో సమగ్ర విచారణ తర్వాతే తెలుస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సమయం ఉంటే సంబంధిత అధికారులను మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తామని, ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. సచివాలయ భద్రతపై సమగ్ర నివేదిక కోరిన అనిత, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.