ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. మంత్రి నారా లోకేశ్ (Lokesh) వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల శ్రీవారి పరకామణి నుండి కోట్ల రూపాయల విలువైన సొత్తు దోపిడీ చేయడంలో వైసీపీ నాయకులే ప్రమేయమున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులతో, అప్పుడు టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకరరెడ్డి అండతోనే ఈ దోపిడీ జరిగిందని లోకేశ్ ఆరోపించారు.

లోకేశ్ తన ఆరోపణలను మరింత బలపరుస్తూ, “దొంగలు దోచుకున్న ఆ డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. ఏమి జరుగుతుందో తెలిసినా జగన్, భూమన పరకామణి దోపిడీకి కళ్ళు మూసుకున్నారు. నిజానికి వారు స్వయంగా ఈ దోపిడీకి పాల్పడ్డారనే చెప్పాలి” అని మండిపడ్డారు. గత పాలకుడు జగన్ గ్యాంగ్ (Jagan Gang) చేసిన తప్పులు ప్రజల ముందు వెలుగులోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. “పరకామణి దోపిడీకి సంబంధించిన వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. ఈ వీడియోలు జగన్ గ్యాంగ్ చేసిన పాపాలకు నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి ఆస్తులపై దోపిడీ జరగడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ స్పష్టం చేశారు.