తిరుమల లడ్డూ కల్తీ (Tirumala Laddu Adulteration) కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ (SIT) తాజాగా దర్యాప్తు నివేదికలో నెయ్యి కల్తీ చేసిన నిందితులను గుర్తించడం పెద్ద సంచలనం సృష్టించింది. ఈ పరిణామంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో స్పందిస్తూ, గత టిటిడి బోర్డు పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బతీశాయని మండిపడ్డారు. భక్తుల విశ్వాసం తిరిగి పొందడానికి, టిటిడిలో పారదర్శకత, ఆడిట్ వ్యవస్థలు, నాణ్యత నియంత్రణ తప్పనిసరి అన్నారు. టిటిడిని నిర్వహించే ప్రతి ఒక్కరూ తమ హోదాను కాకుండా దైవ సేవగా భావించాలని పవన్ హితవు పలికారు. ఈ ట్వీట్లతో పవన్ తిరుమల వ్యవహారాన్ని రాజకీయ చర్చా వేదికగా మలిచారు.
అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రులు ఆర్కే రోజా మరియు అంబటి రాంబాబు ఘాటైన ప్రతిస్పందనలు ఇచ్చారు. రోజా మాట్లాడుతూ – పవన్ కళ్యాణ్ పవిత్రత, ధర్మం గురించి మాట్లాడటం కేవలం రాజకీయ నాటకమని విమర్శించారు. “తిరుమలలో భక్తులు మరణించినప్పుడు నోరు తెరవని పవన్, చంద్రబాబు నాయుడు రక్షణలో ఉన్నప్పుడు మాత్రం అకస్మాత్తుగా ఆగ్రహంతో ట్వీట్లు చేస్తారు. ఇది భక్తి కాదు, రాజకీయ స్క్రిప్ట్” అని రోజా వ్యాఖ్యానించారు. నిజమైన సమగ్రత అంటే అసౌకర్యమైన సందర్భాల్లో కూడా సత్యం కోసం నిలబడటం అని ఆమె ఎద్దేవా చేశారు. “ఒక బోర్డు తిరుమలను రక్షించదు, నిబద్ధత మరియు నిజాయితీ అవసరం. ఇవి పవన్ రాజకీయాల్లో కనిపించవు” అని రోజా తిప్పికొట్టారు.

అంబటి రాంబాబు మరింత కఠినంగా స్పందిస్తూ – “ఓరి దేవుడా! న్యాయం కోసం కాదు, చంద్రబాబు డప్పులకు డ్యాన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ మేల్కొన్నాడు” అని ఎద్దేవా చేశారు. తిరుపతి తొక్కిసలాటలో 6 మంది, సింహాచలం, కాశీబుగ్గల్లో మరణించిన భక్తుల పట్ల పవన్ ఎటువంటి సానుభూతి చూపలేదని, ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. విశాఖపట్నంలో టీడీపీ నేత దగ్గర ఆవు మాంసం స్వాధీనం ఘటనపైనా ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని, ఇది పవన్ కపటత్వానికి నిదర్శనమని అంబటి అన్నారు. వైసీపీ నవంబర్ 12న వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీకి సిద్ధమవుతుండగా, దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ల డ్రామా మొదలుపెట్టారని అంబటి ధ్వజమెత్తారు. ఈ పరిణామాలతో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాజకీయంగా మళ్లీ వేడెక్కింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/