విజయవాడ Water Bulletin : రాష్ట్రంలో సెప్టెంబరు 1వ తేదీన అన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ వాటర్ బులిటెన్లను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (K. Vijayanand) జిల్లా కలక్టర్లను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ మానిటరింగ్ డాష్ బోర్డ్, స్వామిత్వ, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను (Irrigation tanks) పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు ఈసీజన్లో మెరుగైన రీతిలో వర్షాలు పడ్డాయని రానున్న రెండుమాసాల్లో కూడా సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయని అంచనా ఉందనిఅన్నారు. అన్ని జిల్లాల్లోను భూగర్భజలాలను పెంపొందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సెప్టెంబరు 1న జిల్లా వాటర్ బులిటెన్లను విడుదల చేయాలని కలక్టర్లను ఆదేశించారు. గత 6 వారం వాటర్ బులిటెన్లకు సంబంధించి జాతీయ వాటర్ మిషన్ విడుదల చేసిన టాప్ 10 రాష్ట్రాల్లో ఎపి మొదటి స్థానంలో నిలవడంతో పాటు టాప్ 10 జిల్లాల్లో ఎపి జిల్లాలు పార్వతీపురం మన్యం, ఎఎన్ఆర్, అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాలు ఉండడం అభినందనీయమని పేర్కొంటూ ఆయా జిల్లాల కలక్టర్లను సిఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ఈనెల 23వతేది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ చెప్పారు.

అక్టోబర్ 2న స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మెరుగైన సేవలు అందిస్తున్న వారికి తగిన గుర్తింపును ఇచ్చే లక్ష్యంతో వచ్చే అక్టోబరు 2వతేదీ గాంధీ జయంతినాడు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్తమంగా నిలిచిన సంస్థలు, ఎన్జిఓలకు స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 50, జిల్లా స్థాయిలో 55 అవార్డులను వివిధ కేటగిరీల్లో ఎంపికచేసి ఈఅవార్డులు అందించడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీ, స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ అంగన్వాడీ కేంద్రం, స్వచ్చ ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి సహా ఉత్తమ ఎన్జిఓలు, గ్రీన్ అంబాసిడర్లు తదితర కేటగిరీల్లో ఉత్తమంగా సేవలందించిన వారిని ఎంపిక చేసి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు అందించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా ఇన్చార్జి మంత్రి సమక్షంలో అవార్డులు ఇచ్చే కార్యక్రమం జరిగేలా కలక్టర్లు తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. అంతకు ముందు స్వర్ణాంద్ర మానిటరింగ్ డాష్ బోర్డు గురించి మాట్లాడుతూ ఈనెల 25లోగా ఆ డాష్ బోర్డులో డేటాను నమోదు చేయాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :