గుడివాడ రాజకీయాల్లో విమర్శలు, మరింత వేడెక్కుతున్నాయి. ఇటీవల గుడివాడ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, గడచిన ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. “తాను గెలవకపోతే రాజకీయాలనుంచి వైదొలుగుతానంటూ చంద్రబాబు విజయం సాధిస్తే ఆయన బూట్లు శుభ్రం చేస్తానని సవాళ్లు విసిరిన నాని ఇప్పుడు ఏడాది కాలంగా ఎక్కడ దాక్కున్నారు?” అంటూ కఠినంగా ప్రశ్నించారు.

నాని పైన అవినీతి ఆరోపణలు
వెనిగండ్ల రాము మరింతగా ధాటిగా మాట్లాడుతూ, మంత్రిగా ఉన్న సమయంలో నాని అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతి ద్వారా భారీగా సొమ్ము కూడబెట్టుకున్నారని ఎమ్మెల్యే రాము ఆరోపించారు. చేసిన తప్పులకు సిగ్గుపడి, పశ్చాత్తాపం చెందాల్సింది పోయి ఇంకా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
“వెన్నుపోటు దినం” పై ఆగ్రహం
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ ప్రజలు తీర్పు ఇచ్చారని, వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలకు సమాధానం చెప్పారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు సాగించిన అరాచకాలు, దుర్మార్గాలకు గత సంవత్సరం ఇదే రోజున ప్రజలు తమ ఓటు ద్వారా సరైన తీర్పు ఇచ్చారని, దానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ‘వెన్నుపోటు దినం’ అంటూ రోడ్ల మీదకు రావడం దారుణమన్నారు. గడిచిన 20 ఏళ్లుగా గుడివాడ శాసనసభ్యుడిగా కొడాలి నాని అవలంబించిన మోసపూరిత, వెన్నుపోటు రాజకీయాలకు ఆయన జవాబు చెప్పగలరా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం చేస్తే ఉపేక్షించం
ప్రస్తుతం గుడివాడలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే తాము వెనక్కి తడమని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు రోడ్లెక్కి నాటకాలు ఆడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
గుడివాడ విజయాన్ని ప్రజల గౌరవంగా అభివర్ణించిన రాము
కడపలో నిర్వహించిన మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన విషయాన్ని గుర్తుచేస్తూ, గుడివాడలో తాను సాధించిన విజయానికి అభినందనలు తెలియజేశారని, ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.