తూర్పుగోదావరి జిల్లా: బీసీల రక్షణ చట్టం కూటమి ప్రభుత్వంతోనే సాధ్య మని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తమ ప్రభ్నుత్వ కట్టుబడి ఉందని, విష ప్రచారాలను చేయడంలో వైసీపీ విష వృక్షంగా తయారైందని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమ హేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఆయనమీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని శెట్టి బలిజ సామాజికవర్గాన్ని ఓసిల్లో చేరుస్తున్నారంటూ వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షడు చిర్ల జగ్గిరెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి ఖండించారు. కులాల మధ్య చిచ్చు రేపుతూ జగ్గిరెడ్డి అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సుభాష్ మండిపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యకుడిగా ఉన్న వ్యక్తికి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం శోచనీయమన్నారు.

బలిజల గురించి మాట్లాడే వైసీపీ నాయకులకు లేదు
శెట్టి బలిజల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని సుభాష్ స్పష్టం చేశారు. బిసిల రక్షణకోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్న కృతనిశయంతో ప్రభుత్వం ఉందన్నారు. బీసీల రక్షణ చట్టంపై ఇప్పటికే పలుమార్లు బిసి మంత్రులు, శాసనసభ్యులతో సమావేశం నిర్వహించామన్నారు. స్థానిక సంస్థల్లో బిసిల రిజర్వేషన్ల(bc Reservations)ను 24 శాతానికి తగ్గించిన వైసీపీ నేడు బిసీల పట్ల మొసలీ కన్నీరు కారుస్తోందన్నారు. బిసీలకు అగ్రతాంబూలం ఇచ్చిన పార్టీ తెలుగుదేశమని, బార్లు, వైన్ షాపుల్లో, శెట్టిబలిజలకు 10 అవకాశం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సూపర్ సిక్స్ (Super Six)బంపర్ హిట్ కావడంతో వైసీపీ నాయకులకు దిమ్మతిరిగి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని దుయ్య బట్టారు. యూరియా పై కూడ రైతుల్లో అనవసరం భయాందోళనలు కల్పించి దుష్ప్రచారానికి వైసీపీ తెర తీసిందని మంత్రి సుభాష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనదక్షత వల్ల రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందనడం పూర్తిగా అవాస్తవమన్నారు. కేవలం రైతులను భయాందోళ నలకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ విష ప్రచారానికి తెరలేపిందని సుభాష్ వెల్లడించారు. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఏటా సగటున 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఖరీఫ్ సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. ఇప్పటికే ఆగస్టు నెలాఖరు నాటికి 5,69,712 టన్నులు, ఈ నెలలో మరో 94,482 టన్నులు సరఫరా చేశారని తెలిపారు. వాస్తవాలు తెలియకుండా వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు కథనాలతో కృత్రిమ కొరతను సృష్టించడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపింది, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారన్నారు.
రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపే విషయమై మంత్రి స్పందిస్తూ ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి అధిష్టానానికి తీసుకెళ్తానన్నారు. బీసీల ఉన్నతి కోసం ప్రవేశపెట్టిన ఆదరణ పథకాన్ని గత వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని తిరిగి రూ.1000 కోట్లతో పునరుద్ధరించామన్నారు. బీసీలను అన్ని రంగాల్లో రాజకీయంగా సామాజికంగా, ఆర్థికంగా అణగతొక్కి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అలాగే గత వైసిపి కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. డూప్లికేషన్ పేరుతో కార్మికులకు దక్కాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా చేసిందన్నారు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అన్ని జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఏర్పాటుకు కృషి చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కుడిపూడి సత్తిబాబు, కూటమిపార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com