గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణల నిమిత్తం ఆయనను పోలీస్ కస్టడీలో తీసుకున్న అనంతరం, తీవ్ర ఆరోగ్య సమస్యలు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువైంది.

ఆరోగ్య పరిస్థితి క్షీణత – హెల్త్ బులిటెన్ వివరాలు
తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఇవాళ గుంటూరు జీజీహెచ్ కు తరలించి పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించి హెల్త్ బులిటెన్ ను గుంటూరు జీజీహెచ్ అధికారులు విడుదల చేశారు. న్యూరాలజీ సమస్యలతో కూడా బాధపడుతున్న వల్లభనేని వంశీని విజయవాడ జీజీహెచ్ కు తరలించాల్సి ఉండగా అక్కడ స్పెషలిస్టులు లేరనే కారణంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలు విషయాలు బయటపడ్డాయి. వీటిపై రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ లో వల్లభనేని వంశీ ఫిట్స్ తో బాధపడుతున్నట్లు డాక్టర్లు తేల్చారు. అలాగే ఆయనకు నిద్రలో శ్వాస ఆగిపోతోందని కూడా గుర్తించారు.
వైద్య సదుపాయాల లేమి – ఆందోళన కలిగించే నిజాలు
మొదట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉన్నా, అక్కడ నిపుణులు లేని కారణంగా వంశీని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ ఆయన్ను జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ ఆయనకు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారన్నారు. దీంతో స్విమ్స్ లేదా ఆయన కోరుకున్న మరో ఆస్పత్రిలో స్లీప్ టెస్ట్ నిర్వహించేలా రిఫర్ చేశామన్నారు.
పోలీసుల తీరుపై విమర్శలు
వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడాన్ని తెలిసినప్పటికీ, పోలీసులు ఆయనను పోలీసు స్టేషన్లు, కోర్టులు, ఆస్పత్రుల మధ్య తిప్పుతూ విచారణలు కొనసాగిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వంశీ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. అయినా ఇప్పటికీ ఆయన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించకుండా సదుపాయాలు లేని ప్రభుత్వ ఆస్పత్రులకు తిప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read also: Vallabhaneni Vamsi: గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి కొనసాగుతున్న చికిత్స