ముంబై బాంద్రాలో రూ.14.40కోట్లతో శ్రీవారి ఆలయం: టిటిడి బోర్డు నిర్ణయాలు
TTD: తిరుమల : తిరుమల విజన్ 2047 కార్యరూపం దాల్చేందుకు ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు వసతి సౌకర్యాల పెంపుపై “ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్”పేరుతో తిరుపతిలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించింది. ఇందుకు కార్యాచరణ రూపొందించారు. తిరుపతి అలిపిరి వద్ద 20 ఎకరాల్లో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలని భావించారు. ఇక్కడే భక్తులకు వసతితో బాటు టిక్కెట్ కౌంటర్లు, అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దేశవిదేశాల నుండి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో వసతికి అవస్థలు తప్పడంలేదు. ఈ నేపధ్యంలో అలిపిరి వద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని మంగళవారం టిటిడి ధర్మకర్తలమండలి ఆమోదించింది. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షత సమావేశం జరిగింది.
Read also: Satyakumar: వైద్య కళాశాలల విషయంలో జగన్ ‘కోటి సంతకాల డ్రామా’

Integrated township in Tirupati
అన్ని హంగులతో మెరుగైన వసతి
TTD: టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, సి. దివాకర్రెడ్డి, పనబాకలక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జ్యోతులనెహ్రూ, శాంతారాం, నరేశ్, ఎంఎస్ రాజు, నర్మిరెడ్డి, జంగా కృష్ణ మూర్తి, జానకీదేవి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 60 అంశాలపై చర్చించి ఆమోదించిన వివరాలను చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. తిరుమలకు వస్తున్న భక్తులకు వసతి సదుపాయం మెరుగుపరిచేందుకు తిరుపతిలో అన్ని హంగులతో మెరుగైన వసతి అనువుగా ఏర్పాటుకు ఆమోదించారు. అవసరమైన టౌన్లోనింగ్, ఆర్కిటెక్ నియామకానికి ఆమోదం తెలిపారు. ముంబై బాంద్రాలో 14.40కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరుచేశారు.
వంద ఎకరాల్లో దివ్య వృక్షాలను పెంచే
టిటిడి ఆలయాల్లో ధ్వజస్తంభాలు, రథాల తయారీకి అవసరమైన కలపకోసం చిత్తూరుజిల్లా పలమనేరులో వంద ఎకరాల్లో దివ్య వృక్షాలను పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. తిరుమల ఆలయ పోటులో నిబంధనల మేరకు కొత్తగా 18మంది పర్యవేక్షకులు(సూపర్వైజర్) పాచక పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. కలియుగ వైకుంఠం తిరుమలలో రహదారులు, ముఖ్యకూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనల్లోని శ్రీవారి నామాలు వంటి పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం దూర విద్యకేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాధన్, అన్నమాచార్యప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి.ప్రభాకర్ కృష్ణమూర్తి ఉన్నారు.
ప్రసాదం పంపిణీ చేసేవాళ్లకు వేతనాలు పెంచాలని
తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతోబాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టు ఏర్పాటుచేసి భర్తీకి ఆమోదం తెలిపారు. తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టులోని వీరాంజనేయస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. టిటిడి అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం పంపిణీ చేసేవాళ్లకు వేతనాలు పెంచాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అర్చకులకు ప్రస్తుతం 25వేల రూపాయలు వేతనం ఇస్తుండగా 45వేల రూపాయలకు పెంచారు. పరిచారకులకు 23,140 రూపాయల నుండి 30వేల రూపాయలు చేశారు. పోటు కార్మికులకు 24,279 రూపాయల నుండి 30వేల రూపాయలు పెంచారు.
అదనంగా 48కోట్ల రూపాయలు
ఆలయంలోపల ప్రసాదం పంపిణీ చేసే వారికి 23,640 రూపాయల నుండి 30వేల రూపాయలకు పెంచారు. తిరుపతిలో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా 48కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించారు. టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. టిటిడి జూనియర్ కళాశాలల్లోనూ డేస్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుచేయాలని నిర్ణయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: