డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త తెలిపింది. ఆ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా ద్వారా సేవా టికెట్లు
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ప్రముఖ సేవలకు సంబంధించిన టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా విధానంలో భక్తులకు కేటాయించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.
అంగప్రదక్షిణ టోకెన్లు కూడా లక్కీ డ్రా ద్వారా
భక్తుల అనుభవాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా, అంగప్రదక్షిణ టోకెన్లను కూడా లక్కీ డ్రా పద్ధతిలో ఈసారి అందించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. లక్కీ డ్రా(Lucky draw)లో ఎంపికైన భక్తుల వివరాలు సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రకటించబడతాయి. వారికి ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారం అందజేస్తారు. విజేతలు సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్లను ఆన్లైన్‌లో చెల్లించి ఖరారు చేసుకోవాలి.
ఇతర ఆర్జిత సేవలకు ‘మొదట వచ్చిన వారికి మొదట’ పద్ధతి
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి ఇతర సేవల టికెట్లు ఫస్ట్ కం, ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ టికెట్ల కోటాను సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల టికెట్ల కోటా కూడా రిలీజ్ చేస్తారు.
విశేష దర్శనాల కోసం ప్రత్యేక టికెట్ల షెడ్యూల్
సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల కోసం ఉచితంగా అందించే ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు – సెప్టెంబర్ 24న
అత్యధిక డిమాండ్ ఉన్న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలో గదుల బుకింగ్ కోటాను కూడా ఆన్లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
కేవలం అధికారిక వెబ్‌సైట్ నుంచే బుకింగ్ – అప్రమత్తత అవసరం
భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: