తిరుమల : తిరుమల పరకామణిలో చోరీ కేసు విచారణ చేపట్టిన సిఐడి అధికారులు పూర్తి నివేదికలను మంగళవారం హైకోర్టుకు సమర్పించనున్నారు. ఈనేపధ్యంలో గత నెల 6వతేదీ నుండి డిసెంబర్ 1వరకు దాదాపు 26రోజులు వరుసగా సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్, ఆయన నేతృత్వంలోని అధికారుల బృందం హైకోర్టు ఆదేశాలతో సమగ్రంగా దర్యాప్తు చేసింది. 2023లో పరకామణిలో చోరీ జరిగిన ఘటనపై నమోదైన కేసుపై తిరుమల (TTD) వన్డే టౌన్ పోలీసు స్టేషన్ నుండి సిడి రికార్డులు, ఎఫ్ఐఆర్ను, సిసిటివి పుటేజీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వయంగా సిఐడి డిజి పరకామణి భవనంలోకి చేరుకుని కానుకల లెక్కింపు, నోట్లు, నాణేలు వేరు. చేయడం, లెక్కించడం, భద్రతాపరమైన అంశాలను స్వయంగా పరిశీలించారు .అక్కడ సిసికెమెరా ఆపరేటర్ చంద్ర నుండి కూడా వివరాలు రాబట్టారు. కొన్ని సిసి పుటేజీలు స్వాధీనం చేసుకున్నారు. 35మంది వరకు సాక్షులను, నిందితుడ్ని, కీలక అధికారులను విచారణ చేసి 150 పేజీలు పైగా సమాచారం సేకరించి రికార్డు చేశారు.
Read also: Cyber crime: డిజిటల్ అరెస్ట్ తో 48 లక్షలు దోచుకున్న ముగ్గురు అరెస్ట్

CID report is key.. Waiting for verdict in Parakamani case
సతీమణి రమ్యను విచారణ చేసి
నిందితుడు సివి రవికుమార్ ఆయన సతీమణి రమ్యను విచారణ చేసి పలు ఆధారాలు రాబట్టారు. ఇంకా ఈ కేసులో వైసిపి ప్రభుత్వ హయాంలోని టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్లు వైవిసుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్రెడ్డిని, మాజీ ఇఒ ఏవి ధర్మారెడ్డితోబాటు మాజీ సివిఎస్ఒ నరసింహకిశోర్, మాజీ విజిఒ గిరిధర్, ఏవిఎస్ పద్మనాభంను, అప్పటి తిరుమల సిఐలు జగన్ మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను అప్పటి పరకామణి విధుల్లో ఉన్న టిటిడి అధికారులను వరుసగా 35 మందిని విచారణ చేశారు. నిందితుడు రవి కుమార్ భక్తులు సమర్పించిన కానుకల్లో అమెరికన్లర్లు 920 డాలర్లు విలువైనవి చోరీ చేస్తూ 2023 ఏప్రిల్లో పట్టుబడిన విషయం విదితమే. తదుపరి అతనిపై పోలీసు కేసు నమోదు చేయడం, పోలీసులు చట్టప్రకారం వ్యవహరించకుండా లోక్అదాలత్లో మధ్యవర్తిత్వంతో రాజీ కుదుర్చుకోవడం చేశారు. అదే సంవత్సరం మేనెల 20వతేదీ ఛార్జిషీట్ ఫైల్ చేశారు. అంతేగాక ఈ చోరీకేసులో నిందితుడు రవికుమార్ నుండి 2023 జూన్లోనే అప్పటి టిటిడి బోర్డు పెద్దలు 14.43కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను 07 గిప్ట్డ్లుగా శ్రీవేంకటేశ్వరస్వామికి స్వీకరించడం జరిగింది.
నిందితుడుకు సంబంధించిన ఆస్తులు
ఈ వ్యవహారంలో చోరీ సొత్తు విలువ లక్షల్లో ఉంటే శ్రీవారికి కానుకగా 14కోట్ల రూపాయలు ఆస్తులు ఎందుకు స్వీకరించారనేది సిఐడి రాబట్టిన కీలక సమాచారం. అయితే ఈ కేసును అప్పటి టిటిడి ధర్మకర్తల మండలి పెద్దలు, కొందరు పోలీస్ అధికారులు మధ్యవర్తిత్వం జరిపి అదే సంవత్సరం సెప్టెంబర్ 9వతేదీ లోక్అదాలత్లో 582 కేసుగా విచారణ సాగింది. దీనివెనుక ఎంత మొత్తంలో ఎవరెవరు లబ్ది పొందారనేది ప్రధాన ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిగింది. నిందితుడుకు సంబంధించిన ఆస్తులు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, తిరుపతి, విశాఖల్లో ఉన్నట్లు డాక్యుమెంట్లను, వాటిల్లో కొన్ని విక్రయించినట్లు విక్రయ రికార్డులను సిఐడి సేకరించింది. మరో కీలకంగా తిరుపతిలో రెండో అదనపు న్యాయస్థానం సిబ్బందిని సిఐడి అధికారులు ప్రశ్నించి కొంత కీలక విషయాలను సేకరించారు. సమగ్ర సమాచారంతో పరకామణిలో చోరీ కేసుపై సిఐడి చీఫ్ రవిశంకర్అయ్యన్నార్ బృందం నేడు హైకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తికి సమర్పించనున్నారు. తదనంతరం న్యాయస్థానం ఎలాంటితీర్పు వెలువడిస్తుందనేది మాత్రం రాజకీయ వర్గాల్లో, టిటిడి వర్గాల్లో ఎడతెగని ఉత్కంఠ కలిగిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: