భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యంగా సంస్కరణలు
Tirupati: గణతంత్ర దినోత్సవ వేడకల్లో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి(Venkayya Chowdary). టీటీడీలో వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తూ, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుమలలోని గోకులం అతిథి గృహంలో సోమవారం ఉదయం ఘనం నిర్వహించారు.
Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు
ఈ సందర్భంగా అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం సమర్పించి టీటీడీ సిబ్బంది, తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, విజిలెన్స్ సిబ్బంది, పోలీసు విభాగం, శ్రీవారి సేవకులు, భక్తులు, మీడియా ప్రతినిధులకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు (Republic Day Celebrations) తెలిపారు. అనంతరం ఆయన టీటీడీ సిబ్బంది, భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.

రాజ్యాంగ స్ఫూర్తే వ్యవస్థల నిర్మాణానికి పునాది
గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి, స్వయం పాలన సాధించిన రోజు అని ఏ దేశమైనా, ఏ సంస్థైనా దీర్ఘకాలికంగా నిలవాలంటే బలమైన వ్యవస్థ, స్పష్టమైన నిర్మాణం తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
భారత రాజ్యాంగం కాలానుగుణంగా సవరణలు చేసుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగడం వల్లే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని తెలిపారు.
టీటీడీలో పాలసీ ఆధారిత పాలన
టీటీడీ కూడా ఒక పురాతన, మహత్తర ధార్మిక సంస్థగా కాలానుగుణంగా తన వ్యవస్థలను పునఃపరిశీలిస్తూ, భక్తుల అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు చేపడుతోందని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరాల్లో టీటీడీలో అన్నప్రసాద విభాగం పాలసీలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కాటేజ్ డొనేషన్ స్కీమ్ లో సమగ్ర పాలసీ తీసుకురావడానికి విశేష కృషి చేశామని తెలిపారు. ఇతర పాలసీలను కూడా పటిష్టం చేసేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు.
కొనుగోళ్ల విభాగంలో విప్లవాత్మక మార్పులు
టీటీడీ కొనుగోళ్ల విభాగానికి సంబంధించి ఉత్పత్తులు, ప్రాసెస్‌లు, అగ్రిమెంట్లు, క్యాన్సిలేషన్, బ్లాక్‌లిస్టింగ్ వంటి అంశాలతో కూడిన సమగ్ర పాలసీ సిద్ధమవుతోందని, అలాగే అన్ని ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలను పోర్టల్ ద్వారా నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీంతో పారదర్శకత పెరిగి మానవ జోక్యం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు.
అన్ని విభాగాల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం
బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వంటి వరుసగా జరిగిన ఉత్సవాలను లక్షలాది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. ప్రతి కార్యక్రమం అనంతరం పునఃసమీక్షించడం ద్వారా భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
భక్తుల నుండి అభిప్రాయ సేకరణ
వాట్సాప్, ఐవీఆర్ఎస్, ఫోన్ కాల్స్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరిస్తూ సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అన్నప్రసాద సేవల్లో 96–97% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేయగా, లడ్డూ నాణ్యతపై పూర్తిస్థాయిలో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు.
సాంకేతిక సంస్కరణలు
వైకుంఠం–1లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో సమయాన్ని సమర్థంగా వినియోగించుకుని చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 7.83 లక్షల మందికి దర్శనం కల్పించామని చెప్పారు. తిరుమలలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిస్‌ప్లే సిస్టమ్ ద్వారా బస్ స్టాప్ ల వద్ద వేచి ఉండే భక్తులకు బస్సులు వచ్చే సమయాన్ని ముందుగానే తెలియజేసేలా ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు.
క్యూఆర్ కోడ్ ఆధారిత పాద రక్షల కేంద్రాలు
తిరుమలలో భక్తుల పాద రక్షలు భద్ర పరచుకునే సమస్యకు పరిష్కారంగా లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాద రక్షల కేంద్రాలను ఏర్పాటు చేయడంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రతి వ్యవస్థలో పవిత్రత, పారదర్శకత, భక్తుల ప్రయోజనాలే కేంద్రంగా టీటీడీ ముందుకు సాగుతుందని, తిరుమల ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, భాస్కర్, వెంకటయ్య, సోమన్నారాయణ, డిఈ చంద్రశేఖర్, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: