తిరుమల లో జరిగిన పరకామణి చోరీ (Parakamani theft in Tirumala) ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తుఫాన్ రేపుతోంది. ఈ ఘటన వైసీపీ వర్సెస్ కూటమి ఎపిసోడ్‌గా మారింది. ఒక వైపు ఆరోపణలు, మరో వైపు కౌంటర్లు కొనసాగుతున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి, భానుప్రకాష్, కిరణ్ రాయల్ మధ్య మాటల యుద్ధం చెలరేగింది.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఈ వ్యవహారంపై స్పష్టమైన సవాల్ విసిరారు. నా హయాంలో ఏ తప్పూ జరిగిందని తేలితే అలిపిరిలోనే తల నరుక్కుంటాను. దమ్ముంటే సీబీఐతో విచారణ జరపండి అని భూమన ఘాటుగా చెప్పారు. రవికుమార్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా పరకామణిలో చోరీ చేస్తున్నాడని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో కూడా ఈ దొంగతనాలు జరిగాయని ఆరోపించారు. అప్పట్లో ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు.
భానుప్రకాష్ కౌంటర్ – రెండు రోజుల్లో నిజం
బిజేపీ నేత భానుప్రకాష్, భూమన ఆరోపణలకు సమాధానమిచ్చారు. సీబీఐ అవసరం లేదు. ఎస్సై విచారించినా నిజం బయటపడుతుంది. మరో రెండు రోజుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో రాజకీయ వాదోపవాదాలు మరింత వేడెక్కాయి.జనసేన నేత కిరణ్ రాయల్ కూడా ఈ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రవికుమార్ ఇప్పటికే 300 కోట్ల రూపాయలు దొంగిలించాడని ఆరోపించారు. అంతేకాదు, రవికుమార్ వెనుక వైసీపీ నేతలు, అధికారులకు కూడా సంబంధం ఉందని అన్నారు. ప్రస్తుతం అతను బతికే ఉన్నాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
లడ్డూ వివాదం తర్వాత మరో సంచలనం
ఇటీవలి కాలంలో తిరుమలలో వరుసగా వివాదాలు బైటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే లడ్డూ వివాదం చర్చకు వచ్చింది. ఇప్పుడు పరకామణి చోరీ వార్త తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. దొంగను పట్టుకున్నా, అతని వెనుక ఉన్న వారేంటి అన్న ప్రశ్న చుట్టూ రాజకీయ రచ్చ నడుస్తోంది.తిరుమలలో జరుగుతున్న ఈ వివాదాలు ఒకవైపు రాజకీయ కల్లోలానికి కారణమవుతుంటే, మరోవైపు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. “నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు” అనే స్థితి ఏర్పడింది. శ్రీవారి సొమ్ము కాపాడాల్సిన వారు దాన్ని దోచుకుంటే ఎవరు రక్షిస్తారు అన్న ప్రశ్న భక్తులలో వినిపిస్తోంది.
అసలు నిందితులు ఎవరూ?
పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ వెనుక ఉన్నవారెవరు అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంది. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న అసలు వ్యక్తులను బయటపెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి సొమ్ము కాపాడి, భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని భావిస్తున్నారు.తిరుమల పరకామణి చోరీ కేసు ఇప్పుడు రాజకీయ రగడకు కేంద్రంగా మారింది. భూమన, భానుప్రకాష్, కిరణ్ రాయల్ వ్యాఖ్యలతో ఈ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. రెండు రోజుల్లో ఏం జరుగుతుందో, ఎవరి ప్రమేయం బయటపడుతుందో అన్న ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ తగాదాలు పక్కనపెట్టి, శ్రీవారి ఆస్తిని రక్షించడం అత్యవసరం అని భక్తులు కోరుతున్నారు.
Read Also :