ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున దీని ప్రభావం రాష్ట్రంలోని పలు ప్రాంతాలపై ఉంటుందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.
అల్పపీడన ప్రభావం – భారీ వర్షాలు
బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
అధికారులకు సూచనలు
వర్షాల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. వర్షాలు, పిడుగుల సమయంలో రైతులు, ప్రజలు బయట ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఎటువంటి సహాయం కావాలన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని అధికారులు కోరారు.
Read Also : Rahul : రాహుల్ గాంధీకి కర్ణాటక CEO నోటీసులు