ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట స్థానం కలిగిన మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ప్రజలకు అత్యంత చేరువైన నాయకుడిగా, ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాటం చేసిన నాయకుడిగా ఆయన చిరస్మరణగా నిలిచారనిగుర్తుచేశారు. ఎర్రన్నాయుడు ఎంత ఎత్తుకు ఎదిగినా, తన మూలాలను ఎప్పుడూ మరచిపోని నిజమైన ప్రజానేత అని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు
ఎర్రన్నాయుడు రాజకీయ జీవితమంతా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగిందని, అనేక క్లిష్టమైన సమస్యలపై ఆయన పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడిగా, వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుండే నేతగా ఎర్రన్నాయుడు అందరికీ ప్రేరణగా నిలిచారని అన్నారు. ముఖ్యంగా, రాష్ట్ర హక్కుల విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా పోరాడిన నేతల్లో ఆయన ముందు వరుసలో నిలిచారని లోకేశ్ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల సమస్యలను ఢిల్లీలో గట్టిగా వినిపించిన నాయకుడు
తెలుగు రాష్ట్రాల సమస్యలను ఢిల్లీలో గట్టిగా వినిపించిన గొప్ప నాయకుడిగా ఎర్రన్నాయుడు గుర్తింపు పొందారని, భాష పెద్ద సమస్య కాదని, ధృడ సంకల్పం ఉంటే దేశ రాజకీయాల్లో గొప్ప ముద్ర వేసుకోవచ్చని నిరూపించిన నేతగా కొనియాడారు. దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో ఆయన చెరగని ముద్ర వేశారని, ఆయన సేవలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని లోకేశ్ తెలిపారు.