Steel Plant : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేయత్నాలు వేగవంతమయ్యాయని, విశాఖ స్టీల్ (Visakha Steel) ప్రైవేటీకరణ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును (Chief Minister Chandrababu Naidu) తెలుగుజాతి క్షమించదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె. రామకృష్ణ (K. Ramakrishna) సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆంధ్రుల హక్కుగా పోరాడి సాదించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా యాజమాన్యం ఇప్పటికే 3000 మంది కాంట్రాక్టు కార్మికులను నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. 1140 మంది పర్మినెంట్ ఉద్యోగులను విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపింది. ఇప్పుడు మరో 1017 మంది పర్మినెంట్ ఉద్యోగులను పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోందన్నారు.
అంతేకాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన టిపిపి
ఎస్ఎంఎస్-1, 2, 3, ఎంఎంఎస్ఎం, ఎస్బిఎం, డబ్ల్యూఆర్ఎం-1, 2, 6, మాదారం మైన్స్, రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్-1, 2, 8, సిఎంఎస్, ఫౌండ్రీ, ఎస్టిఎం, ఈఎన్ఎండి, బ్లాస్ట్ ఫర్నిస్-1, 2, 3 వంటి ఒకేసారి 32 విభాగాలను ప్రైవేట్ వారికి అప్పచెప్పేందుకు ఉక్కు మేనేజ్మెంట్ టెండర్స్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 10వ తేదిన టెండర్లు ఖరారు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు యాజమాన్యం సిద్ధమైందన్నారు. దీనిని బట్టి కేంద్రలో నరేంద్రమోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోకూటమి ప్రభుత్వం రెండు కుమ్మక్కై అంచెలంచెలుగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు పావులు వేగంగా కదుపుతున్నాయని గోచరిస్తున్నది. మరోవైపు రాష్ట్రానికి చెందిన ఎంపిలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించకుండా, అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్న మిట్టల్ స్టీలకు క్యాపిటివ్ మైన్స్ కేటాయించాలని, అనుమతులివ్వాలని కోరడం సిగ్గుచేటు విషయం అన్నారు. ప్రభుత్వరంగాన్ని కాదని, మిట్టల్కు సేవ చేసేందుకు ఎంపిలు ఉద్యుక్తులవ్వడం దుర్మార్గమన్నారు.

ఎంపిలు ఇదే పద్దతుల్లో వ్యవహరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు (Development programs) చేపట్టినప్పటికీ ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపకపోతే తెలుగు జాతి క్షమించదన్నారు. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడేందుకు ముందుకు రావాలని, తక్షణమే లఖిలపక్షక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :