ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt ) రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రకారం, వచ్చే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం (Single-use Plastic Ban) అమల్లోకి రానుంది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఈ నిబంధన మొదట అమలవుతుంది.
సర్క్యులర్ ఎకానమీపై దృష్టి
సచివాలయంలో నిర్వహించిన ‘సర్క్యులర్ ఎకానమీ’ సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, వ్యర్థాలను సద్వినియోగం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెచ్చే విధంగా వాటిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే, వృథాగా పోతున్న ప్లాస్టిక్, ఇతర రీసైకిలబుల్ పదార్థాల నుంచి ఆదాయాన్ని సృష్టించే దిశగా చర్యలు చేపడతామన్నారు.
వేస్ట్ మేనేజ్‌మెంట్‌కి ప్రోత్సాహక అవార్డులు
పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లలో అవసరమైన యంత్రాల సంఖ్యను పెంచుతామన్నారు. వేస్ట్ మేనేజ్‌మెంట్ భాగస్వామ్యం వహిస్తున్న మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ‘స్వచ్ఛత’ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా శుభ్రత, పర్యావరణ సంరక్షణ విషయంలో అగ్రగామిగా నిలవడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
Read Also : Akhilesh Yadav: ఇండియా కూటమి చెక్కుచెదరదు: అఖిలేశ్ యాదవ్