గోదావరి జిల్లాల్లో సిద్ధమైన పందెం కోళ్ళు
Sankranti festival: గోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ ఇప్పటికే ప్రారంభమైంది గ్రామాల్లో హరిదాసుల ఆలాపనలు, గుమ్మం ముందు గంగిరెద్దుల పలకరింపులు, వాకిట్లో రంగురంగుల ముగ్గులతో ఏడాదికి ఒకసారి వచ్చే పల్లె పండుగ సంక్రాంతి హడావిడి ఇప్పటికే ప్రారంభమైంది. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పందెం లక్ష రూపాయలు నుంచి ప్రారంభమయ్యే భారీ బరులు (అరెనాలు) 200 నుంచి 250కి పైగా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.
Read also: AP: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హెచ్చరిక
ప్రధానంగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, దుగ్గిరాల వంటి ప్రాంతాల్లో మినీ స్టేడియం తరహాలో వేదికలు సిద్ధమవుతున్నాయి. పందెం రాయుళ్లు మరియు నిర్వాహకులు సకల హంగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. భీమవరం(Bhimavaram)లో అయితే సెలబ్రిటీలు పాల్గొనే కోడి పందేల బరుల్లో ఎల్ ఈ డీ స్క్రీన్లు, వీఐపీ గ్యాలరీలు, బఫే భోజనాలు, లైవ్ కామెంటరీతో హంగులు ఉంటాయి. దగ్గరగా చూసేందుకు కొన్ని చోట్ల టికెట్లు (₹1500 వరకు) కూడా విక్రయిస్తారు.

గతేడాది ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.150 నుంచి 200 కోట్ల పందేలు జరిగినట్టు అంచనా, ఉభయ గోదావరి జిల్లాలు కలిపి ₹250-700 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా ₹1000 కోట్లకు పైగా పందెలు జరిగే అవకాశం ఉందని ఈసారి అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ఎప్పటిలాగే గోదావరి జిల్లాల్లో జరిగే సంక్రాంతి పండుగకు విదేశాలనుంచే కాకుండా తెలంగాణ, కర్నాటక నుంచి పందెం రాయుళ్లు రావడం విశేషం. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ఎన్నారై లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పాల్గొనే బరులు గకోనసీమ జిల్లాల్లో కొబ్బరి తోటలు, పొలాల్లో రహస్యంగా ఏర్పాటు చేస్తారు.
కోడి పందాలు భారతదేశంలో చట్టవిరుద్ధం. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960 సెక్షన్ ప్రకారం పక్షులను జంతువులను హింసించకూడదని చట్టం. సుప్రీం కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో నిషేధం ఉన్నప్పటికీ, సంప్రదాయం పేరుతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసులు కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ పూర్తిగా ఆపడం వారి వల్లకావడంలేదు. ఇదిలా ఉండగా ఈ కోడి పందేలు కొన్ని ప్రాంతాల్లో కత్తులు లేకుండా (కాలి గోరుతో మాత్రమే) పందాలు నిర్వహించే విధానం ఉన్నప్పటికీ దాదాపు అన్నిచోట్ల కత్తులు కట్టి జరుగుతాయి.

పశ్చిమగోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల పెంపకం కుటీర పరిశ్రమగా భావిస్తారు. ఒక్కో వ్యక్తి దగ్గర సుమారు పదుల్లో, వందల్లో కూడా అన్ని జాతుల కోడి పుంజులు ఉంటాయి. ప్రధానంగా భీమవరతో పాటు చుట్టుపక్కల గల ప్రాంతాలు వెంప, మొగల్తూరు, పేరుపాలెం, మంచిలి, నరసాపురం, కైకలూరు, ఆకివీడు ప్రాంతాల్లో లక్షలు విలువ చేసే కోడి పుంజులను పెంచుతారు. వీటిలో నెమలి, అబ్రస్, రెడ్ ఈగిల్, కక్కెర వంటి రకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. వాటి ధరలు ₹50,000 నుంచి ₹3 లక్షల వరకూ ఉంటుంది. కోళ్ల పెంపకందారులు పుంజులకు దసరా నుంచే శిక్షణ, ప్రత్యేక ఆహారం ఇస్తారు.
విశ్వసనీయ సమాచారం మేరకు
పోలీసుశాఖ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ లు ఈసారి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కోడి పందేలను నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్నిచోట్ల డ్రోన్లు, స్పెషల్ టీములతో నిఘా, రైడ్లు, బరులు ధ్వంసం, నోటీసులు, బైండోవర్ కేసులు వంటి చర్యలతో సిద్ధంగా ఉన్నారు.
ఏది ఏమైనా చట్ట ప్రకారం కోడిపందాలను అడ్డుకుంటారో లేక ఎప్పటిలాగే చేతులెత్తేస్తారో అనేది వేచి చూడాలి.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: