పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యూహలు, ప్రతి వ్యూహాలతోనే కాలం గడుపుతున్నారే తప్ప సామాన్య ప్రజలకు ఆందోళన కలిగించే సమస్యలపై దృష్టిసారించలేక పోతున్నారు. ప్రజలపై ఎలా భారం వేసి ఆదాయాన్ని పెంచుకోవాలన్నదే ధ్యేయంగా ప్రభుత్వంలోని నేతలు ఆలో చిస్తుంటే వేసిన భారాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చ డానికి ప్రతిపక్ష నేతలు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకానీ సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా త్రికరణశుద్ధిగా పనిచేయలేకపోతున్నారు. ఇటీవల కాలంలో అవీఇవి అని కాదు, అన్ని వస్తువుల ధరలు (prices)పెంచే కార్యక్రమం ఉధృతమైంది. గత ప్రభుత్వాల కాలంలో పెంపు కార్యక్రమం లేదని చెప్పడం లేదు. అప్పుడు కూడా ఉంది. గతంలో పాలకులు విద్యుత్, బస్సు చార్జీలు పెంచినప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఇది అన్యాయం, అక్ర మం అంటూ నినదించి ప్రజలను సమీకరించి ఉద్యమానికి నడుంకట్టారు. కేంద్రప్రభుత్వ పరిధిలోని వస్తువుల ధరలు పెరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆ ధరల(prices)కు వ్యతిరేకంగా ఉద్యమించారు. నాయకులు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించారు. పరిస్థితుల దృష్ట్యా మారిన కాలానికి అనుగుణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర కారణాలతో ధరలు పెంచక తప్పడం లేదని ఆనాడు అధి కారంలో ఉన్న పెద్దలు సెలవిచ్చారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఇష్టానుసారంగా పెంచినప్పుడు ఇదే పరిస్థితి. అయితే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఈ ధరలను ఉద్యమాలతో తీవ్రంగా వ్యతిరేకించిన పెద్దలే అధికారంలోకి రాగానే ధరలు పెంచని తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని చిలకపలుకులు పలికారు.
Read Also: http://Rammohan Naidu: అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు

రిజిస్ట్రేషన్లతోపాటు భూముల విలువలు
కేంద్రస్థాయిలో పరిస్థితి అలా ఉంచితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడవీలైతే అక్కడ ప్రభుత్వ ఆదా యాన్ని పెంచుకోవడం కోసం రిజిస్ట్రేషన్లతోపాటు భూము ల విలువలు లాంటివి పెంచుతూ ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా రు. విద్యుత్ రేట్లను పెంచేందుకు ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యుత్ కానీ, పెట్రోలు, డీజిల్, బస్సు చార్జీలు పెంచడం పరోక్షంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతూ సామా న్యుడి జీవితాన్ని మరింత దుర్భరం చేస్తాయి. ఇతర సమ స్యల మాట ఎలాఉన్నా రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు ప్రజాజీవితాలను నరకప్రాయంగా మారుస్తున్నా నిత్యావసర వస్తువులధరలను అదుపులో పెట్టే ఆలోచన కానీ, ప్రయ త్నం కానీ, దాదాపు జరగడంలేదనే చెప్పొచ్చు. అదేమంటే సంక్షేమం, అభివృద్ధి అంటారు. అందుకే ఉచిత పథకాలు ఇష్టానుసారంగా ప్రకటిస్తున్నారు. కొత్త కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికా రం కోసం అడిగినవే కాదు అడగని వరాలు కూడా ఇస్తున్నారు. దారిద్య్రరేఖకు దిగువనున్న నిర్భాగ్యులకు చేయూత నివ్వాల్సిందే. అందులో మరో అభిప్రాయానికి తావులేదు.. చేపలు ఉచితంగా పంపిణీ చేయడం కాదు చేపలు పట్టుకోవడం నేర్పించాలన్నట్లు జీవనోపాధికి ఉప యోగపడే పథకాలు, విద్య, శిక్షణలు అందివ్వాలి. ఆ కోణంలో మాటలు చెపుతున్నా చేతల్లో మాత్రం శూన్యమనే చెప్పచ్చు. ఇక ఆ విషయం అలా వదిలిపెడితే పూటగడవని సామా న్యుడి సమస్యల పరిష్కారం వైపు దృష్టి సారించక పోవడం దురదృష్టకరం. ముఖ్యంగా అదుపు తప్పిపోతున్న ధరలను నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో ఆశించిన మేరకు శ్రద్ధచూపడం లేదు.
చర్చకు చోటు లేదు
చివరకు ప్రజాసమస్యలను కూలకషం గా చర్చించి పరిష్కారం వైపు అడుగులు వేయడానికి చేయూతనిచ్చే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలైన శాసన సభలు, లోక్సభ, రాజ్యసభల్లో కూడా ధరల సమస్య చర్చకు చోటు దక్కడం లేదు. సమగ్ర చర్చల సంగతి దేవుడెరుగు. కనీసం ఇటీవల కాలంలో ప్రస్తావన కూడా రాకపోవడం దురదృష్టకరం. ఉన్న డబ్బును ఎలా ఖర్చుపెట్టాలో తోచని వారికి నల్లధనస్వాములకు ఏవస్తువు ధర ఎంత పెరిగినా, చీకూచింతా ఉండకపోవచ్చు కానీ, కూలీనాలీ చేసుకునేవారు, రెక్కాడితే డొక్కాడనివారు, నెల జీతం మీదనే ఆధారపడి జీవనం సాగించే మధ్యతరగతి పరిమితి ఆదాయం గలవారిదే సమస్య అంతా. ఇంటి పన్నులు పెంచుతున్నారు. అద్దెలు పెరిగిపోతున్నాయి. కరెంటు చార్జీలు అద్దెలో దాదాపు మూడోవంతు చేరుకున్నాయి. గ్యాస్ ధరనే తీసు కుందాం. ఓ పక్క గ్యానున్ను నిరుపేదలకు అందించాలని ఎంతో కొంత సబ్సిడీ ఇస్తూనే మరొకపక్క మధ్యతరగతి వారికి అందకుండా పెంచుకుంటూపోతున్నారు. 1980 సం వత్సరంలో గ్యాస్ ధర యాభైఆరు రూపాయలు ఉంటే ఎనభైఆరు నాటికి ఆరురూపాయలు మాత్రమే పెరిగింది. ఆ తర్వాత అదుపులేకుండా పోయింది. నేడు తొమ్మిది వందలకు చేరుకున్నది. ఇక కిరోసిన్ పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు అందాల్సిన కిరోసిన్ ఎలా పెట్రోల్లోకి చేరుకుంటుందో తెలియంది కాదు. ఒకపక్క గ్రామాలు సైతం కట్టెల పొయ్యిని మరిచి పోతున్నారు. రానురాను కట్టెలు దొరకడం కూడా కష్టమైంది. మరొకపక్క కిరోసిన్ అందుబాటులో లేకుండాపోతున్నది.
అందుబాటులో లేని ధరలు
కాల పరిస్థితులకు అనుగుణంగా మనుషుల అలవాట్లు కూడా మారిపోయాయి. ఇంకా మారుతూనే ఉన్నాయి. ఒకటి, రెండు రోజులు భోజనం లేకుండా అయినా ఉండగలుగుతారు కానీ టీ, కాఫీ లేకుండా ఉండలేని పరిస్థితుల్లో సామాన్యులు సైతం ఇరుక్కుపోయారు. పప్పుబెల్లాలే కాదు, ఉప్పు, మిరప కాయలు కూడా భగ్గున మండుతున్నాయి. పప్పుదినుసులు పరిస్థితి చెప్పక్కర్లేదు. అదీ, ఇదీ అనితేడా లేకుండా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెలలో ఉన్న ధర ఈనెలలో ఉండడం లేదు. ఇప్పుడు ఉన్నధర వచ్చే నెల ఉండదు. ఇలా ధరలను ఇష్టానుసారంగా పెంచుతూనే ఉన్నారు. అయితే ఒక్కడ ఒక విషయం గమనించాలి. రైతు ల వద్ద సరుకులు ఉన్నప్పుడు మాత్రం ధరలు పాతాళ లోకంలో ఉంటున్నాయి. బియ్యం విషయం తీసుకున్నా ఇది స్పష్టమవుతుంది. ఉత్పత్తిదారుల నుండి, వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి రెట్టింపు అయిపోతున్నాయి. పోని వ్యాపా రస్తులైనా సంతోషంగా ఉన్నారంటే అదీలేదు. వెనుక రాజ కీయ అండలు ఉన్నవారు తప్ప వ్యాపారులు కూడా రకర కాల ఇబ్బందులు పడుతున్నారు. ఉత్పత్తిదారునికి, వినియోగదారుడికి మధ్య వ్యత్యాసం నిత్యావసర వస్తువుల్లో దేనిని తీసుకున్నా దేశవ్యాప్తంగా వేలాది కోట్లలో తేడా ఉండవచ్చు. ఇదంతా ఎటుపోతున్నది? ఎవరి జబుల్లోకి చేరుతుంది? తదితర విషయాలన్నీ తెలియనివి కావు. ఇటీవల కూరగా యల పరిస్థితి మరీవిచిత్రంగా తయారైంది. చిల్లర సామా నుల కంటే కూరగాయల ధరలు నిప్పులు లేకుండానే మండిపోతున్నాయి.

కూరగాయల ధరలు
సామాన్యమైన చిక్కుడు, బెండా, బీర, లాంటివి కూడా కిలో వంద రూపాయలకుపైగా అమ్ముతున్నారు. ఆకు కూరల ధరలు అందుబాటులో లేవు. మరొకపక్క కూరగా యలు పండించే రైతులు ఏమాత్రం సంతోషంగా లేరు. రాను రాను కూరగాయల సాగు తగ్గిపోతున్నది. ఇతర పంటల మాదిరి కాదు. ఎప్పటిప్పుడు మార్కెట్కు తీసుకుపోయి కూరగాయలను అమ్ముకోవాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యాలు లేవు. బతిమాలో, భంగపడో అంతోఇంతో దళారు లకు దక్షిణ సమర్పించుకొంటే తప్ప మార్కెట్లో అమ్ముకో లేనిపరిస్థితి. మార్కెట్లలో కనీస వసతులు కూడా లేవు.దళా రుల దౌర్జన్యాలు పెరిగాయి. 36 ఇన్నిబాధలు పడలేక మధ్యతర గతి రైతులు కూరగాయల సాగుకు మంగళం పాడేరు, పాడుతున్నారు. రైతు బజారులు ఏర్పాటు చేశారు. రైతులే నేరుగా తాము పండించిన కూరగాయాలు తీసుకువచ్చి వినియోగదారులకు అమ్మేందుకు ఉద్దేశించిన రైతు బజార్లు నేడు అధికశాతం దళారులు ఆక్రమించుకొన్నారు. ధరల పెరుగుదల బాధ అందరిది. సంసారాన్ని సరిదిద్దుకోలేక ఎందరో గృహిణుల ఆవేదన వర్ణనాతీతం. ధరలను అదుపు చేస్తామని ఉపన్యాసాలు ఇస్తున్నారు. కమిటీలు వేస్తున్నారు. రివ్యూలు చేస్తున్నారు. ఫలితం మాత్రం శూన్యం.
-దామెర్ల సాయిబాబ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: