ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద జరిగిన భయంకర ప్రమాదానికి రెండు వారాలు గడిచిపోయాయి. కానీ, ఇప్పటికీ గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ దొరకలేదు.సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నప్పటికీ, వారి ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఎప్పుడో కనుమరుగైంది.ఇప్పుడంతా మృతదేహాలను వెలికితీయడంపైనే దృష్టి సారించారు. సహాయక బృందాలు ఎంతో శ్రమిస్తున్నాయి.వందలాది మంది నిపుణులు రంగంలోకి దిగారు.తాజాగా మరింత సమర్థంగా చర్యలు చేపట్టేందుకు కడావర్ డాగ్ స్క్వాడ్‌ను కూడా ప్రవేశపెట్టారు.ఈ ప్రత్యేక శునకాలను మృతదేహాల గుర్తింపుకు శిక్షణ ఇచ్చారు. 15 అడుగుల లోతులో ఉన్నవాటినీ గమనించగలగే సామర్థ్యమున్న ఈ జాగిలాలను ప్రత్యేకంగా కేరళ పోలీస్ విభాగం నుంచి హెలికాప్టర్ ద్వారా తీసుకువచ్చారు. అదనంగా సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు 110 మంది సిబ్బంది టన్నెల్‌లోకి ప్రవేశించారు. ప్రాణహాని పరిస్థితుల్లోనూ వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు.

ఇప్పటి వరకు అనేక రకాల ఆధునిక పరికరాలు మిషనరీలు ఉపయోగించినా గల్లంతైన వారి ఆచూకీ మాత్రం తెలియలేదు.దీంతో ఈ శునక బృందం ద్వారా ఎప్పటికైనా సమాధానం దొరుకుతుందేమోనన్న ఆశ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టింది. సహాయక చర్యలకు మరింత బలం చేకూర్చేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రజలు, బంధువులు నిరీక్షిస్తున్నారు. ఈ ఘటన దురదృష్టకరమైనదే అయినా గల్లంతైన వారి మృతదేహాలను కనుగొనడం కొంతమేరకు కుటుంబసభ్యులకు ఉపశమనం కలిగించగలదని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు మరింత వేగంగా సాగి, త్వరలోనే స్పష్టత రావాలని అందరూ ఎదురుచూస్తున్నారు.