ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు వ్యవస్థాపకుడు పద్మవిభూషణ్ రామోజీరావు (Padma Vibhushan Ramoji Rao) ప్రథమ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన అక్షర యోధుడిని తలచుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్మరణాంజలి అర్పించారు.రామోజీరావు పేరు వినగానే విశ్వసనీయత గుర్తుకొస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన జర్నలిజం విశ్వాసాన్ని కాపాడుతూ ప్రజల అభిప్రాయాలను అక్షరాలుగా పదిలం చేయిందన్నారు. మీడియా అనేది సమాచార స్రవంతికే పరిమితం కాదని, ప్రజల హక్కుల కోసం పోరాడే శక్తిగా రామోజీరావు చూపించారని తెలిపారు.
తలవంచని నైజంతో సమాజాన్ని మేల్కొలిపిన యోధుడు
రామోజీరావు విలక్షణమైన వ్యక్తిత్వంతో, సమాజంపై చెరగని ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు. వ్యాపారాల్లోనూ ప్రజా ప్రయోజనాలను ముందుంచే ధోరణి ఆయన ప్రత్యేకత అని గుర్తుచేశారు. ఏ అక్రమ వ్యవస్థనైనా ఎదుర్కొనే ధైర్యం ఆయన జర్నలిజానికి గుర్తుగా నిలుస్తుందన్నారు.
ఈనాడు ఉద్యమం – ప్రజల గొంతుకగా మారింది
ఈనాడు సంస్థలు ప్రజల సమస్యలపై ఎంతగా పోరాడాయో అందరికీ తెలిసిన విషయమే. రామోజీరావు నాయకత్వంలో వచ్చిన ఆ ఉద్యమాలు తెలుగు మీడియా చరిత్రను మార్చేశాయన్నారు చంద్రబాబు. సత్యానికి నిలువెత్తు రూపంగా ఆయన వ్యవస్థలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు.
రామోజీరావు జీవితం – నిత్య ప్రేరణగా నిలవాలి
రామోజీరావు మన మధ్య లేకపోయినా, ఆయన జీవితం అందరికీ మార్గదర్శిగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. అటువంటి మహనీయుడిని గుర్తు చేసుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత అన్నారు. “తెలుగు జాతికి ఆయన గర్వకారణం. ఆయన నింపిన స్పూర్తితో ముందుకు సాగుదాం,” అని సీఎం పిలుపునిచ్చారు.
Read Also : BRS : మాగంటి మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం..