हिन्दी | Epaper

PMSuryaGhar: జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి

Pooja
PMSuryaGhar: జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి
  • పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన”పై విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష
  • జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.

నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 18, ప్రభాత వార్త

PMSuryaGhar: సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు “పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన” పథకం కింద జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం కలెక్టర్ వారి చాంబర్లో “పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన”పై విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పచ్చని, స్వచ్ఛమైన శక్తి వినియోగాన్ని పెంపొందించడం, సౌర రూఫ్‌టాప్ వ్యవస్థలను ప్రోత్సహించడం కోసం తాజా జనగణన ప్రకారం 5వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు.

Read Also:AP: తిరుమల లడ్డూపై చర్చించాలన్న బొత్స సత్యనారాయణ


ఈ పథకం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి సౌర ఆధారిత హోం లైటింగ్ సిస్టమ్‌లు, సౌర నీటి సరఫరా వ్యవస్థలు, వ్యవసాయ అవసరాలకు సౌర పంపులు, గ్రామ రహదారులు మరియు సామూహిక మౌలిక వసతుల వద్ద సౌర వీధి దీపాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో తొలి విడతగా మోడల్ సౌర గ్రామాలుగా లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివేలపాలెం, మనుబోలు, కాకుపల్లి ఈ ఆరు గ్రామాలను ఎంపిక చేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి కూడా సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా కలెక్టర్ చెప్పారు. ఈ గ్రామాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఒక గ్రామాన్ని జిల్లాలో మోడల్ సౌర గ్రామంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా రూ.కోటి మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ నగదును గ్రామ సమగ్ర అభివృద్ధికి వినియోగిస్తామని వివరించారు.

స్వర్ణ వార్డ్, స్వర్ణ గ్రామ కార్యాలయాల ద్వారా ఈ పథకం పై విస్తృతంగా అవగాహన కల్పించాలని జడ్పీ డిప్యూటీ సీఈఓను కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పీఎం సూర్య ఘర్ సోలార్ విద్యుత్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించి, జిల్లాలో ఈ పథకాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, విద్యుత్ శాఖ ఎస్ ఈ రాఘవేంద్ర, ఈఈ బాలచంద్ర, డిప్యూటీ సీఈవో మోహన్ రావు, విద్యుత్ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870