విజయవాడ: గ్రామ పంచాయితీల్లోనూ భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులిచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో అమలులో ఉన్న డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (DPMS)ను పంచాయితీలకూ అనుసంధానించ నున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని పంచాయితిల్లోనూ ఇదేవిధానంలో కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. పురపాలక, పంచాయితీరాజ్ శాఖల మధ్య దీనిపై ఇప్పటికే చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి పంచాయితీల్లోనూ ఆన్లైన్ అనుమతుల విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అనుమతులు లేకుండానే నిర్మాణాలు
పంచాయితీల్లో కొత్త ఇళ్లు, భవన నిర్మాణాలకు అనుమతులకు ఇప్పటి వరకు పారదర్శకమైన వ్యవస్థ లేదు. చాలా చోట్ల నేతల ప్రమేయంతో అనుమతులు లేకుండానే నిర్మాణాలు వెలుస్తున్నాయి. పంచాయితీ కార్యదర్శులు(Panchayat Secretaries), జిల్లా పట్టణ ప్రణాళిక అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దడానికి అనుమతుల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పట్టణ, స్థానిక సంస్థల్లో అమలులో ఉన్న డిపిఎంఎస్ విధానాన్ని పంచాయితీలకు అనుసంధానించాలని ఆరు నెలల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసినా కొన్ని సాంకేతిక, ఫీజుల విషయంలో తలెత్తిన సమస్యలతో తాత్కాలికంగా వాయిదా వేశారు. వీటి పరిష్కారానికి ఉన్నత స్థాయిలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు ఇప్పటి వరకు పంచాయితీ కార్యదర్శులు అనుమతులిస్తున్నారు. అంతకంటే మించినవి జిల్లా పట్టణ ప్రణాళిక అధికారులకు వెళ్తున్నాయి. భారీభవనాలైతే పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు ఇస్తున్నాయి. నిబంధనల ప్రకారం పంచాయితీలకు ఫీజుల్లోరావాల్సిన వాటా మొత్తాలు పట్టణాభివృధ్ధి సంస్థలు సరిగా విడుదల చేయట్లేదు. డిపిఎంఎస్ విధానం అమల్లోకి వచ్చాక పంచాయితీలకు పక్కాగా ఆదాయం రావాల్సిందేనని పంచాయితీరాజ్ శాఖ పట్టుబడు తోంది. ప్రభుత్వ స్థాయిలో త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: