News Telugu: విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థి క్రమశిక్షణ పాటించలేదని కోపగించిన టీచర్, అతనిపై హింసాత్మకంగా ప్రవర్తించి చేయి విరగ్గొట్టాడు. ఈ సంఘటన ఆలస్యంగా బయటకు రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్లాస్‌లో జరిగిన గొడవ
విశాఖపట్నం మధురవాడ (Madhurawada) ఆదిత్యనగర్‌లోని శ్రీ తనుష్ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న నరేష్ (13) అనే విద్యార్థి మంగళవారం (ఆగస్ట్ 26) తరగతి గదిలో తన క్లాసుమేట్ తో వాగ్వాదానికి దిగాడు. తగువులు కొట్టుకునే స్థాయికి చేరుకోవడంతో క్లాస్‌లో గందరగోళం నెలకొంది. ఈ పరిణామంపై ఆగ్రహించిన సోషల్ టీచర్ మోహన్, నరేష్‌ను తీవ్రంగా కొట్టాడు. అంతేకాదు, షర్ట్ పట్టుకుని తోసేయడంతో బాలుడు ఇనుప బెంచీపై బలంగా పడిపోయాడు. ఆ దెబ్బతో నరేష్ చెయ్యి విరిగిపోయింది(hand is broken). గాయపడిన విద్యార్థిని ఆగకుండా మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానపరిచాడు.
తల్లిదండ్రుల ఆవేదన
తరువాత నరేష్ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. వెంటనే వారు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు విద్యార్థి చేయి విరిగిందని నిర్ధారించారు. చికిత్స చేయించిన తర్వాత నరేష్‌ను ఇంటికి తీసుకువచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన – స్కూల్ నిర్లక్ష్యం
బుధవారం వినాయక చవితి కారణంగా సెలవు ఉండగా, గురువారం ఉదయం నరేష్ తండ్రి ఆదినారాయణతో పాటు కుటుంబ సభ్యులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. టీచర్ మోహన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన స్కూల్ సిబ్బందిని ప్రశ్నించారు. తమ బిడ్డకు న్యాయం చేయకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి అనురాధ, పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సునీత స్కూల్‌కి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. టీచర్ మోహన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: