ఉర్సా క్లస్టర్ కంపెనీ(Ursa Cluster Company)కి సంబంధించి జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ (Lokesh) జగన్‌మోహన్ రెడ్డికి బంపర్ సవాల్ విసిరారు. ఇటీవల వైసీపీ నేతలు విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్‌కి రూపాయికే భూములు కేటాయించారని ఆరోపణలు చేయగా, అవి పూర్తిగా అవాస్తవమని లోకేష్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అవి అబద్ధమని తేలితే మాత్రం జగన్ రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
“ఎకరం = రూపాయి” అనే వాదన
లోకేష్ వివరాల ప్రకారం, విశాఖ ఐటీ హిల్–3 ప్రాంతంలో ఎకరానికి రూ. కోటి చొప్పున 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో ఎకరానికి రూ. 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు ఉర్సా క్లస్టర్‌కు కేటాయించారని తెలిపారు. జగన్ మాత్రం బురద జల్లి ప్యాలస్ లో దాక్కుని నిరాధార ఆరోపణలు చేస్తూ పారిపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే కాదు, ఉర్సా సంస్థ కూడా తమ భూముల ధరలపై ఆధారాలు చూపించినా వైసీపీ మాత్రం ప్రజలను మోసం చేసేలా “ఎకరం = రూపాయి” అనే వాదన కొనసాగిస్తోందని విమర్శించారు.
భవిష్యత్తులో పర్మనెంట్ ఆఫీస్ ఏర్పాటు
ఉర్సా క్లస్టర్ సంస్థ ఇప్పటికే 1995 నుంచి సిలికాన్ వ్యాలీలో అనేక కంపెనీలను స్థాపించిన అనుభవం ఉన్న సంస్థగా గుర్తింపు పొందిందని, ఈ ప్రాజెక్టుకు విదేశీ పెట్టుబడులు (FDI) రావడంతో రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సంస్థ ప్రతినిధి సతీష్ అబ్బూరి వివరించారు. నిబంధనల మేరకు సంస్థ రిజిస్ట్రేషన్ తాత్కాలిక చిరునామాతో జరిగిందని, భవిష్యత్తులో పర్మనెంట్ ఆఫీస్ ఏర్పాటుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ భూములు రెండు సంవత్సరాల్లో అభివృద్ధి చేయకపోతే తిరిగి ప్రభుత్వానికి చేరే షరతుతో కేటాయించారని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, దీనిపై నిజాయితీగా స్పందించాలని లోకేష్ ఖరాఖండిగా డిమాండ్ చేశారు.