
ప్రేమ, సేవ, శాంతి మార్గాలను ప్రపంచానికి పరిచయం చేసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబు నిజమైన దైవస్వరూపమని ప్రధాని నరేంద్రమోదీ(Modi) ప్రశంసించారు. పుట్టపర్తి పవిత్ర భూమి ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో జరిగిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు.
సాయి కుల్వంత్ హాల్‌లోని సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకోగా, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న మోదీ, భగవాన్ సత్యసాయిబాబా జీవిత చరిత్ర, సేవలకు గుర్తుగా రూపొందించిన రూ.100 జ్ఞాపిక నాణెం మరియు నాలుగు తపాలా బిళ్ళలను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
మానవ సేవే మాధవ సేవ
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “మానవ సేవే మాధవ సేవ అని బాబా విశ్వసించేవారు. ఆయన బోధనలు కోట్లాది మందికి దిశా నిర్దేశం చేశాయి. సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాలుపంచుకోవడం నాకు గొప్ప భాగ్యం,” అని పేర్కొన్నారు. సత్యసాయి బాబా ప్రచారం చేసిన ‘Love All – Serve All’ భావన సమాజానికి శాంతి, ఏకత్వం, సేవాస్ఫూర్తిని అందించిందని ఆయన అన్నారు.
బాబా సందేశాలు పుస్తకాల్లో మాత్రమే కాకుండా ప్రతిఒక్కరి ఆచరణలో ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు. పేదలకు, ఆపదలో ఉన్నవారికి సాయిబాబా సేవాదళ్ ఎప్పుడూ ముందుంటుందని గుర్తుచేశారు. గుజరాత్ భూకంప సమయంలో సాయి సేవాదళ్ అందించిన సేవలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాబా సేవలు దేశాల సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని అన్నారు.
“వికసిత్ భారత్” లక్ష్యాన్ని దిశా నిర్దేశం
తన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రస్తావించిన మోదీ, ఎన్డీయే పాలనలో “వికసిత్ భారత్” లక్ష్యాన్ని దిశా నిర్దేశం చేస్తున్నామని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఉన్నాయని తెలిపారు. గోసంరక్షణ కోసం ప్రారంభించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్‌ను కూడా ఈ సందర్భంగా వివరించారు. సత్యసాయి బాబా స్ఫూర్తితో ‘వోకల్ ఫర్ లోకల్’ ఉద్యమాన్ని దేశమంతా మరింత బలపరచాలని ప్రధాని పిలుపునిచ్చారు.
తనకు సత్యసాయి బాబాతో ఉన్న అనుబంధాన్ని మోదీ ఆవిష్కరిస్తూ, గతంలో ఆయనతో జరిగిన భేటీలకు సంబంధించిన ఫోటోలను Twitter లో పంచుకున్నారు. “పుట్టపర్తిలో శతజయంతి వేడుకల్లో ప్రజలతో కలిసి ఉండడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. బాబా జీవితం, ఆయన సేవా పరమార్థం తరతరాలకు ఆదర్శం,” అని ప్రధాని పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :