ఆంధ్రప్రదేశ్‌లోని పేదవారికి మంచి శుభవార్త. రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు త్వరలో తమ ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం దక్కనుంది. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో, వివిధ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల ప్రగతి, లబ్ధిదారుల సమస్యల గురించి ప్రశ్నలు అడిగారు.
వీటికి సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ.. 2026 జూన్ నెలాఖరులోపు రాష్ట్రంలోని 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆ దిశగా ముందుకెళ్తున్నట్లు వివరించారు. అలాగే ఎక్కడైనా టిడ్కో ఇళ్లు పూర్తి అయితే.. ప్రతి శనివారం వాటిని లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioners) కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణంతో పాటుగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.7280 కోట్లు అవసరం అవుతాయని మంత్రి నారాయణ వివరించారు. ఈ నిధులను వివిధ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో, హడ్కో ద్వారా సమీకరిస్తున్నట్లు తెలిపారు. టిడ్కో ఇళ్ల (Tidco houses) విషయానికి వస్తే 2014-19 మధ్యకాలంలో కేంద్రం ఏపీకి 7,01,481 టిడ్కో ఇళ్లు కేటాయించింది.
వీటిలో సుమారుగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి. అనంతరం ఈ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. అయితే వైసీపీ ప్రభుత్వం వీటిని 2,61,640 కు తగ్గించిందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఆ ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయలేదని నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించి.. త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోందని వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: