తెలుగు సినీ పరిశ్రమ(Tollywood)లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan) సినిమాల విడుదల సమయంలోనే థియేటర్లు మూతపడడం వెనుక కుట్ర కోణం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమ పూర్తిగా మద్దతుగా ఉండగా, ఇప్పుడు మాత్రం ప్రభుత్వంతో సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సమంజసం కాదని మంత్రి ప్రశ్నించారు.
పవన్ సినిమాల రిలీజ్ టైమ్‌కే ఇబ్బందులు ఎందుకు?
ప్రముఖ థియేటర్లు లీజుకు వెళ్లిపోవడం వల్ల ఏర్పడుతున్న సమస్యలపై మంత్రి దుర్గేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ సినిమాల విడుదల సమయంలోనే ఇలాంటి సమస్యలు తెరపైకి రావడం విచారకరమన్నారు. ప్రభుత్వం పరిశ్రమకు అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇలాంటి వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా థియేటర్ల బంద్ కథనాలు బయటికి రావడం వెనుక నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ సహకారం తిరస్కరించవద్దు – దుర్గేశ్ హెచ్చరిక
జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనే వార్తలు వచ్చినప్పుడు ఫిలిం ఛాంబర్ ఎందుకు స్పందించలేదని మంత్రి నిలదీశారు. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, దూరంగా ఉండే వైఖరి సరైనదికాదని చెప్పారు. సంఘాలు కలిసి వస్తేనే సమస్యలపై స్పందిస్తామని, ఇకపై వ్యక్తిగతంగా ఎవరినీ ఎంటర్టైన్ చేయబోమని స్పష్టం చేశారు. “ఉపముఖ్యమంత్రి గారు చెప్పిన ‘రిటర్న్ గిఫ్ట్’కి తగిన విధంగా ప్రభుత్వ స్పందన ఉంటుంది. ప్రభుత్వ సహకారాన్ని తేలికగా తీసుకుంటే, దాని ప్రభావాలు వారే చూడాల్సి ఉంటుంది,” అంటూ మంత్రి దుర్గేశ్ హెచ్చరించారు.
Read Also : LIC : 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!