విజయవాడ: రాష్ట్రానికి చెందిన మెప్మా సంస్థకు 9 ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. పేదరిక నిర్మూలనకు చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డులు వరించాయి. మొత్తం 9 విభాగాల్లో అవార్డులురాగా దిల్లీలో జరిగిన కార్యక్రమంలో మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్కోచ్ ప్లాటినం అవార్డులను స్వీకరించారు. మెప్మా సంస్థ పట్టణ పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వినూత్న పథకాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని ఆయన కొనియాడారు.
ప్లాటినం అవార్డు ఆంధ్రప్రదేశ్ కు
ఈ స్కోచ్ ప్లాటినం అవార్డు (Platinum Award)ఆంధ్రప్రదేశ్కు రావటం గర్వకారణమని తెలిపారు. పట్టణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న మార్గాలను ఈ అవార్డు దేశానికి చాటిచెప్పిందని తేజ్ భరత్ అన్నారు. సిఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సహకారంతో ఈ 9 అవార్డులు కైవసం చేసుకోవడం సాధ్యపడిందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007 జులైలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఏర్పాటైంది. నగరపాలిక, పురపాలికలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని మహిళలతో సంఘాలను ఏర్పాటు చేసి వారికి పొదుపుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎపిఎస్ఆర్టీసి ప్రతిష్టాత్మక ‘స్కోచ్ అవార్డ్’
మరో విభాగంలో ఎపిఎస్ఆర్టీసి ప్రతిష్టాత్మక ‘స్కోచ్ అవార్డ్’ (Scotch Award)సాధించింది. 2025 ఏడాదికిగాను ప్రతిష్టాత్మకమైన ‘స్కోచ్ అవార్డ’ను ఆర్టీసీ కైవసం చేసుకుంది. డిజిటల్ టికెట్లు జారీ చేసే విధానం సమర్థంగా అమలు చేస్తున్నందుకు ఈ అవార్డు సాధించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఛీఫ్ ఇంజనీర్ వై. శ్రీనివాస రావు అవార్డు అందుకున్నారు. అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. రెవెన్యూ శాఖకు 2 ‘స్కోచ్’ అవార్డులు లభించాయి. ప్రజలకు రెవెన్యూశాఖ సేవలను చేరువ చేస్తూ, సులువుగా మెరుగైన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషికి ఫలితం దక్కింది. 2025కి గాను రాష్ట్ర రెవెన్యూ శాఖ 2 ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు సాధించింది. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చాక ప్రజల భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ రెవెన్యూ కోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చింది. ఆర్డీవో, ఆ స్థాయికి ఆన్లైన్లో సమస్యలను పంపి సత్వరమే ఆమోదించేలా సరికొత్త వ్యవస్థను అమలు చేస్తున్నారు.
ఆన్ లైన్ కోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేసి రెవెన్యూ కోర్టు వ్యవహారాలను డిజిటలైజ్ చేసి కేసుల పరిష్కారంలో పారదర్శకత, వేగం పెంచింది. రెవెన్యూ కోర్టుల్లో కేసుల పెండెన్సీని తగ్గించింది. పౌరులకు సలభమైన యాక్సిస్ కల్పించారు. అందువల్ల దేశంలోనే అత్యుత్తమ వ్యవస్థగా గుర్తించి స్కోచ్ అవార్డుకు ఎంపిక చేశారు. రీ సర్వే 2.0 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూములను సహేతుక విధానాల్లో సర్వే చేసి తప్పులకు తావు లేకుండా, సరికొత్త సాంకేతికత వినియోగించి ట్యాంపరింగ్కు తావులేని సమగ్రమైన భూ రికార్డులను తయారు చేస్తోండగా దీనికి మరో స్కాచ్ అవార్డు దక్కింది. అలాగే వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి. తాజాగా దిల్లీలో జరిగే ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్లో ఈ అవార్డులను సంబంధిత అధికారులు అందుకున్నారు.
స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్ట్కు ఏడాది లోపే స్కోచ్ గోల్డెన్ అవార్డు అభినందనీయం: చంద్రబాబు
మొదటి సంవత్సరం లోనే ప్రతిష్టాత్మకమైన స్కోచ్ గోల్డెన్ అవార్డు అందుకోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ విశిష్ట విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రాజెక్ట్లో భాగంగా 1,600 కుటుంబాలు సౌరశక్తితో విద్యుత్ను వినియోగిస్తుండగా, ఏటా 4.69 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. ఫలితంగా కర్బన ఉద్గారాలను తగ్గించగలిగారని వివరించారు. హరిత స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ ప్రాజెక్ట్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: