ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) విద్యా రంగంలో పారదర్శకత, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు జూలై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, జూనియర్ కాలేజీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి విద్యా సంస్థలో ఈ సమావేశాలు నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
విద్యా ప్రణాళిక, మౌలిక సదుపాయాలపై చర్చ
ఈ పేరెంట్ టీచర్ మీటింగ్(Mega Parent Teacher Meeting)ను ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల విద్యా పురోగతిపై, బోధన ప్రమాణాలపై, మౌలిక సదుపాయాల అవసరాలపై తల్లిదండ్రులకు వివరణ ఇవ్వనున్నారు. అలాగే ప్రతి విద్యా సంస్థ తమ కార్యాచరణ ప్రణాళిక, లక్ష్యాలు, అమలవుతున్న పథకాలపై వివరాలను తెలియజేస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపర్చే లక్ష్యం వహిస్తోంది.
పిల్లల మానసిక ఆరోగ్యం, ఆటల పోటీలు ప్రత్యేక ఆకర్షణ
ఈ కార్యక్రమంలో పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథాన్ని పెంపొందించేలా చర్చలు, సలహాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా, విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగించే ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో విద్యార్థుల భవిష్యత్‌కు మరింత బలమైన పునాది వేయాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
Read Also : YCP : గత ప్రభుత్వంలో వికలాంగులు కాకపోయినా పెన్షన్లు ఇచ్చారు – సీఎం చంద్రబాబు