విజయవాడ : బాధ్యతా రాహిత్యం, అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలపై మరో 11 మంది వైద్యులు, నర్సులపై తగు క్రమశిక్షణా చర్యలు చేపట్టెందుకు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ (Health Minister Satyakumar Yadav) విచారణకు ఆదేశించారు. 2020లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, నర్సుల నిర్వాకాలపై ఎసిబి (అవినీతి నిరోధక శాఖ) ఇచ్చిన నివేదికను పరిశీలించిన మంత్రి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. గుడివాడ ప్రభుత్వాఆసుపత్రిలో అక్రమాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎసిబి ఫిబ్రవరి 2020 లో రెండు రోజుల పాటు తనిఖీ నిర్వహించి నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం అప్పటి ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆరుగురు వైద్యులు, పరిపాలనాధికారి (ఏఓ), ఇద్దరు నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఎసిబి తనిఖీ చేసిన రెండు రోజుల్లో ఆసుపత్రి నిర్వహణ, పరిశుభ్రత, అంతర్గత ఆడిట్ రిపోర్టులపై తీసుకున్న చర్యలు, రోగులకు భోజన సరఫరా మరియు నాణ్యత మందుల సరఫరా మరియు స్టాకు వివరాలు, నియమాల ప్రకారం వైద్య సిబ్బంది పాటించాల్సిన డ్రెస్ కోడ్, పరిశుభ్రతలకు సంబందించి లోతైన పరిశీలన చేసి, వైద్య సిబ్బందిని ప్రశ్నించిన మీదట రూపొందించిన నివేదికలో పలు లోపాలను వెల్లడించింది. వివిధ స్థాయిల్లో పర్యవేక్షణా లోపాన్ని ప్రధానంగా ఎసిబి వివరించి, తత్ఫలితంగా ఎదురైన అవకతవకలను వివరించింది. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన పర్యవేక్షణ విషయం పై దృష్టి సారిస్తున్న మంత్రి సత్యాకుమార్ యాదవ్ 2020లో ఎసిబి ద్వారా గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో వెల్లడైన ఈ లోపాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రి నిర్వహణకు సంబందించి 2014-18 కాలంలో వచ్చిన అంతర్గత ఆడిట్నివేదికలపై తగు చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా మంత్రి స్పందించారు. వ్యవస్థ నిర్వహణ మెరుగు పడేందుకు దోహద పడే ఆడిట్ రిపోర్టుల పట్ల ఉదాసీనతను సహించలేమని మంత్రి అన్నారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం వాడే పలురకాల కిట్లు, గ్లాసులు వంటగది, పంపు షెడ్డు, ప్లంబర్ రూమ్ ఇతరచోట్ల చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని ఏసి బి పర్యవేక్షణా రాహిత్యానికి సాక్ష్యంగా చూపింది. వాడటానికి వీలుకాని వాహనాన్ని దీర్ఘకాలం పాటు వదిలించుకోకుండా డ్రైవరును వేరే పనులకు వాడుకొని లక్షల మేరకు జీతం చెల్లించడాన్ని ఎసిబి తప్పుపట్టింది. పర్యవేక్షణారాహిత్యం కారణంగా ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రత లోపించడాన్ని ఎసిబి వెల్ల డించింది. రోగులకు భోజనం అందించే విషయంలో ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని, భోజన నాణ్యత నాసిరకంగా ఉందని, రోగుల వివరాల్లో తప్పులున్నాయని ఎసిబి వెల్లడించింది. రోగులకు మందుల సరఫరా, స్టాక్ రిజిస్టర్లో వ్యత్యాసాలు, ప్రతిరోజూ రోగులమంచాలపై దుప్పట్లు మార్చకపోవ టానికి సంబంధించి ఎసిబి నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులను బాధ్యులుగా చేసింది.

అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో 2020లోనే ఎసిబి జరిపిన మరో తనిఖీ దరిమిలా ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ గత నెల 27న 22 మంది వైద్యులు, ఇతర సిబ్బందిపై విచారణకు ఆదేశించారు. రెండువారాలలోపే అదే రీతిలో మరో నివేదిక వెల్లడవటం గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న బాధ్యతారాహిత్యానికి, అక్రమాలకు అద్దం పట్టిందని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ప్రభుత్వాసుపత్రుల్లో పర్యవేక్షణ పటిష్టం చేయడంపై ద్రుష్టిపెట్టిన సత్యకుమార్ యాదవ్ ఈ దిశగా పలు సమీక్షలు చేపట్టారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :