ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసుపై మరోసారి స్పందించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సేనతో సేనాని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సుగాలి ప్రీతి కేసులో తాను చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. “తాను చేసిన త్యాగాలను, కృషిని మర్చిపోవడం బాధాకరం” అంటూ పవన్ వ్యాఖ్యానించారు.పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ – “సుగాలి ప్రీతి (Sugali Preethi) కేసులో నా పరిస్థితి పండ్లున్న చెట్టుకు రాళ్లు వేసినట్టుగా మారింది. ఆ సమయంలో నేను చేసిన పోరాటం, నేను చెప్పిన మాటలు, నేను వెళ్లిన ప్రదేశాలు ఇవన్నీ చరిత్రలో సాక్షిగా నిలిచాయి. అయినప్పటికీ, నాపై తప్పు ఆరోపణలు చేయడం, చేయూతనిచ్చిన వారిని తిట్టడం నిజంగా బాధాకరం” అని అన్నారు.సుగాలి ప్రీతి తల్లి పార్వతి వ్యాఖ్యలపై విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన పార్టీ సేనతో సేనాని కార్యక్రమంలో స్పందించారు. తాను గత ప్రభుత్వ హయాంలో సుగాలి ప్రీతి కేసుపై చేసిన పోరాటాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు.
చట్టప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే కనీసం రోడ్ల మీదకు రావడానికి ఎవరూ సాహసించని పరిస్థితి. అలాంటి సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సీబీఐ (CBI) కి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. చట్టప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ సుమారు రూ.2 కోట్ల వరకూ మార్కెట్ విలువ ఉంటుందని అంటున్నారు. కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇంటి స్థలం, సుగాలీ ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. రాజకీయపరంగా మనం తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితమే ఇది’ అన్నారు పవన్ కళ్యాణ్.

ప్రీతి కేసుపై సీఐడీ ఛీఫ్ తో మాట్లాడి
గత ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది.. లెటర్ ఇచ్చి లాకర్‌లో పెట్టింది. నేను ఉపముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సీఐడీ ఛీఫ్ తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీ గారితో, హోంమంత్రి గారితో మాట్లాడాను. సీఐడీ విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం.. అనుమానితుల డీఎన్‌ఏలు సరిపోలడం లేదు.. సాక్ష్యాలు తారుమారు చేశారు. గత ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది. అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణశుద్దిగా కోరుకుంటున్నాను. ఇది ఒక్క సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు. బాలికల భద్రతకు సంబంధించిన అంశం’ అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Read hindi news: hindi.vaartha.com
Read also: