ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Card) పంపిణీ ముమ్మరంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80 శాతం మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన 20 శాతం మందికి కార్డుల పంపిణీ చివరి దశలో ఉందని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
చివరి దశలో భాగంగా మిగిలిన 9 జిల్లాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. అక్టోబర్ 31వ తేదీ వరకు లబ్ధిదారులు తమ కార్డుల్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే ఉచితంగా చేయించుకోవచ్చని సూచించారు. కార్డుల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, వాటిని సరిచేయించుకోవడానికి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న తర్వాత తప్పులను సరిదిద్ది, కొత్త కార్డులను ఉచితంగా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సౌలభ్యం వల్ల కార్డుల్లోని తప్పుల గురించి ఆందోళన చెందుతున్న లబ్ధిదారులకు పెద్ద ఊరట లభించింది. స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ పూర్తయితే పౌరసరఫరాల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్డులు లబ్ధిదారులకు డిజిటల్ సేవలను సులభంగా పొందేందుకు ఉపయోగపడతాయి.