వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (Jagan) నెల్లూరు పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గురువారం నెల్లూరులో విలేకర్లతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ ఇమేజ్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు. అలాంటి సీఎంను అభినందించుకున్నా ఫర్వాలేదు కానీ, ఆయనను శాపనార్థాలు పెడుతున్నారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసుల వైఫల్యం అంటూ ప్రభుత్వంపై నిందలు వేశారని గుర్తు చేశారు. జగన్, చంద్రబాబును బావిలో దూకమని అనడంపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగనే బావిలో దూకాలని కోటంరెడ్డి పేర్కొన్నారు.
జగన్ పర్యటనలో అరాచకం – చర్యలకు కోటంరెడ్డి డిమాండ్
జగన్ పర్యటన (Jagan Tour) సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ చెయ్యి విరగొట్టారని, ప్రభుత్వ ఆసుపత్రి గోడను సైతం కూలగొట్టారని కోటంరెడ్డి తెలిపారు. నడి రోడ్డుపై ధర్నాలకు దిగారని పేర్కొంటూ, వీరందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అలా అయితేనే ఈ తరహా ఘటనలు పునరావృత్తం కావని ఆయన స్పష్టం చేశారు. జగన్ వెంట ఉన్న అనుచర గణం వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా కోటంరెడ్డి ఎండగట్టారు. చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని వారికి సూచించారు. గత ఐదేళ్ల అధికారంలో ఉండి అన్ని వ్యవస్థలను నాశనం చేశారంటూ వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు తాము తప్పకుండా సమాధానం ఇస్తామన్నారు.
వైసీపీ గత అరాచకాలు, నైతికతపై ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశంసించారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే ముందు వైఎస్ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. గత ఐదేళ్లలో టీడీపీ సీనియర్లపై అక్రమ కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. గతంలో ‘అక్క, అన్నా’ అంటూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల చుట్టూ తిరిగిన జగన్, ఆ తర్వాత వారిపై ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు అతడిని వెనకేసుకు రావడాన్ని ప్రశ్నించారు. జగన్‌కు ఇంగిత జ్ఞానం ఉంటే, సీఎం చంద్రబాబుకు, నెల్లూరు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై జగన్ మైనింగ్ ఆరోపణలు చేయగా, వైఎస్ రాజారెడ్డి సైతం మైనింగ్ చేశారని జగన్‌కు కోటంరెడ్డి గుర్తు చేశారు. గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ పార్టీకి చేసిన సాయాన్ని మరిచిపోయావా అంటూ జగన్‌ను కోటంరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
Read Also ; Nara Lokesh : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన లోకేష్