కేంద్రం అధికారికంగా ప్రకటన
విజయవాడ: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65ని గొల్లపూడి వరకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్గడ్కరీ (Nitin Gadkari) అధికారికంగా ధ్రువీకరిస్తూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కు (చిన్ని) లేఖ రాశారు. ఈ రహదారిని గొల్లపూడి వరకు 6 వరసలుగా విస్తరించాలని పట్టుబడుతూ ఎంపీ శివనాథ్ సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జాతీయరహదారుల అధికృత సంస్థ అధికారులు దానికి ఆమోదించారు.

ప్రస్తుతం పెరిగిన 28 కి. మీ. లతో కలిసి మొత్తం 226 కిలో మీటర్లకు డిపిఆర్ సిద్ధం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే65ను గొల్లపూడి వరకు విస్తరించాలంటూ సిఎం చంద్రబాబు నాయుడు గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేస్తూ లేఖ రాశారు. గతంలో ఉన్న ప్రతిపాదన ప్రకారం గొల్లపూడి వరకు ఈ రోడ్డుని 6 వరసలుగా విస్తరించాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సిఎం లేఖ రాశారు. ఈ హైవే హైదరాబాద్-విజయవాడ కనెక్టివిటీకి సంబంధించినదని గొల్లపూడి (Gollapudi) వరకు విస్తరిస్తేనే ప్రయోజనం ఉంటుందని లేఖలో సిఎం చంద్రబాబు వివరించారు.
హైదరాబాద్ నుంచి మల్కాపూర్ వరకు 40 కిలోమీటర్లు 6 లైన్లుగా ఉంది. మల్కాపూర్ నుంచి విజయవాడ శివారు గొల్లపూడి వద్ద పశ్చిమ బైపాస్ వరకు 226 కిలోమీటర్లు ఇప్పుడున్న 4 వరుసల స్థానంలో 6 లైన్లుగా విస్తరించేలా గతంలోనే ప్రతిపాదన ఉంది. తాజాగా ఈ రహదారికి మార్గం సుగమం అయింది. 65 విస్తరణ మొదట ప్రతిపాదనల ప్రకారం మల్కాపురం నుంచి విజయవాడ శివారులోని గొల్లపూడి దగ్గర పశ్చిమ బైపాస్ వరకు ఇప్పుడున్న 226 కిలోమీటర్లు నాలుగు నుంచి ఆరు వరుసలుగా విస్తరించాలి. దీనికి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసి డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గొల్లపూడి వరకు కాకుండా అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు క్రాస్ అయ్యే కంచికచర్ల వరకే విస్తరించే ప్రతిపాదనను హైవే అథారిటీ అధికారులు లేవనెత్తారు. దీంతో విస్తరణ 226 కిలో మీటర్ల నుంచి 198 కి.మీ. తగ్గిపోయింది. ఈ ఆలోచనను ఎంపి శివనాథ్ తీవ్రంగా వ్యతిరేకించి, సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సిఎం సైతం గొల్లపూడి వరకు ఆరు వరుసలు చేయాలని కేంద్రమంత్రికి లేఖ రాశారు. ఫలితంగా ప్రస్తుతం ఈ రహదారి విస్తరణకు సాకారమైంది. ఈ రహదారి విస్తరణతో పాటు పాత డిపిఆర్లో ఉన్న అంశాలు కూడా సాకారం కానున్నాయి. గొల్లపూడి మీదుగా వెళుతున్న విజయవాడ పశ్చిమ బైపాస్ ను ఈ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. దీని వల్ల హైదరాబాద్- విజయవాడతో పాటు, హైదరాబాద్ -చెన్నై మార్గాన్ని కూడా అనుసంధానం చేసినట్లు అవుతుంది. ఇబ్రహీంపట్నం దిగువ వరకు పశ్చిమ బైపాస్ వస్తోంది. దీంతో పాటు పరిటాల, ఐతవరం తదితర ప్రాంతాల్లోనూ బైపాస్లు రానున్నాయి. ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నిర్మాణానికి సమస్య ఉన్నందున విటిపిఎస్ కాలువ వరకు ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్లే విబి30 కూడా అనుసంధానం అవుతుంది. ఇలా గొల్లపూడి వరకు రోడ్డు విస్తరించడం వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి .
Read hindi news: hindi.vaartha.com
Read also: Nominated Post: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభం