ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) మాచర్లలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కొత్త ప్రణాళికలను వెల్లడించారు. పశువుల (Cattle ) సంరక్షణ కోసం ప్రత్యేక హాస్టళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. పశువులకు కావాల్సిన షెడ్లు కట్టించి, ఆ హాస్టళ్లకు నేరుగా గడ్డి సరఫరా చేసే విధానం అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు, పశుపోషకులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుందని సీఎం వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrbabu) మాచర్ల రాజకీయ పరిస్థితులపై కూడా వ్యాఖ్యలు చేశారు. “ఎక్కడో రాజీవ్ గాంధీ హత్య జరిగినా, మాచర్లలో రౌడీలు విధ్వంసం సృష్టించారు” అని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగని ప్రాంతంగా మాచర్లను గతంలో చూస్తున్నామని మండిపడ్డారు. ప్రజలకు న్యాయం జరిగేలా ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడమే తమ కర్తవ్యమని ఆయన తెలిపారు.
అలాగే, గతంలో మాచర్లకు రావాలనుకున్నప్పుడు తనను అడ్డుకునేందుకు ఇంటికి తాళ్లు కట్టారని చంద్రబాబు విమర్శించారు. “నా ఇంటికి తాళ్లు కడితే, మీ మెడలకు ఉరితాళ్లు వేసుకున్నట్లే” అని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రజల తీర్పు ఎంత కఠినమో గుర్తుంచుకోవాలని, ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి, పారదర్శక పాలన ద్వారానే మాచర్లలో శాంతి, శ్రేయస్సు నెలకొంటుందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.