మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని (Perni Nani) సహా దాదాపు 400 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పేరుతో అనుమతి లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.పోలీసుల వివరాల ప్రకారం పేర్ని నాని, పేర్ని కిట్టు, సింహాద్రి రమేశ్ బాబు, కైలే అనిల్ కుమార్, ఉప్పాల రాము, దేవాబత్తుల చక్రవర్తి, దేవినేని అవినాశ్‌తో పాటు వందలాది మంది వైసీపీ కార్యకర్తలు ఈ కేసులో ఉన్నారు. మొత్తం 400 మందిపై కేసులు నమోదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

పోలీసుల చర్యపై పేర్ని నాని ఆగ్రహం
తమపై కేసులు పెట్టడంపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 400 మందిపై కేసులు పెట్టడం అర్థరహితమని అన్నారు. 360 రోజులు సెక్షన్ 30 పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడుతున్న తమను జైలులో పెట్టాలనుకుంటే పెట్టాలని అన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. 2014-19 మధ్యలోనే ప్రభుత్వం కాలేజీలను నడపలేమని ప్రకటించిందని గుర్తుచేశారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత వైద్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో 17 కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చారని తెలిపారు. వాటిలో ఐదు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు.
నిరసనకు అనుమతి నిరాకరణ
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిందని తెలిపారు. నిరసనకు అనుమతి కోరినా అధికారులు నిరాకరించారని చెప్పారు. మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లే మార్గంలోనే అడ్డుకుంటామని అధికారులే ముందుగానే హెచ్చరించారని తెలిపారు. అయినా ప్రజల తరఫున పోరాడడం ప్రతిపక్షం బాధ్యత కాబట్టి చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం నిర్వహించామన్నారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పదేళ్ల శిక్ష వచ్చే సెక్షన్లు పెట్టారని పేర్ని నాని ఆరోపించారు. ప్రజల కోసం పోరాటం కొనసాగుతుందని, ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు. “నెల కాకపోతే రెండు నెలలు జైలులో పెట్టండి” అంటూ తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జిల్లా ఎస్పీపై స్పందన
జిల్లా ఎస్పీ చర్యలను స్వాగతిస్తున్నామని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కానీ అదే విధంగా జనసేన, టీడీపీ నేతల అక్రమాలపై కూడా కొరడా ఝుళిపించాలని డిమాండ్ చేశారు. “హత్యలు చేసి బయట తిరుగుతున్నవారు సిగ్గుపడటం లేదు. మాపై కేసులు పెడితే మేమెందుకు వెనుకాడాలి?” అని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ విధానాలపై ప్రజల తరఫున పోరాడుతామని వైసీపీ స్పష్టం చేసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కేసులు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
Read Also :