తిరుమల : తిరుమల ఆలయపవిత్రతను కాపాడటంతోబాటు సాధారణ భక్తులకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు సాంకేతికత వినియోగంపై దృష్టి పెడతామని టిటిడి నూతన ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ (EO Anil Kumar Singhal) తెలిపారు. దేవుని ఆశీర్వాదబలం, తన పూర్వజన్మసుకృతంతోనే రెండవసారి ఇఒగా బాధ్యతలు చేపట్టే అవకాశం కలిగిందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అవకాశం మరింత బాధ్యతను పెంచిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chief Minister Chandrababu Naidu) కు ధన్యవాదాలు తెలిపారు. టిటిడి ఇఒగా రెండవసారి నియమితులైన సింఘాల్ బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు చేపట్టారు. భక్తుల నుండి అభిప్రాయసేకరణతో సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
అన్నప్రసాదాల నాణ్యత మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసిన సమయంలో మెరుగైన నాణ్యమైన సేవలకు సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. గత సంవత్సరం నుండి స్వామివారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యత మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
గతంలోనూ మూడు సంవత్సరాలు నాలుగునెలలు ఇఒగా శ్రీవారికి, భక్తులకు సేవలందించే అవకాశం కలిగిందన్నారు. టిటిడి (TTD) అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్ళు కృషి చేసి స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని, ఆశేషసంఖ్యలో భక్తులకు సంతృప్తికరంగా సేవలందిస్తున్నారని తెలిపారు.
భక్తుల సూచనలు స్వీకరించి టిటిడి సేవలు
శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టిటిడి సేవలు మెరుగుపరుస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేపట్టారని, ఇప్పటికే టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి పర్యవేక్షణలో ఏర్పాట్లు బావున్నాయన్నారు.

నూతన ఇఒగా బుధవారం ఉదయం ఆయన ఆలయంలోపల రంగనాయకుల మండపంలో బదిలీ అయిన ఇఒ శ్యామలరావు (EO Shyamala Rao) నుండి బాధ్యతలు స్వీకరించారు. టిటిడి అదనపు ఇఒ వెంకయ్యచౌదరి, టిటిడి జెఇఒ వీరబ్రహ్మం సింఘాల్లో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆలయంలోపల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులందుకున్నారు.
నడకదారిలో ఆయన నడచిరావడం విశేషం
రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి అదనపు ఇఒ వెంకయ్యచౌదరి, ఆలయ డిప్యూటీ లోకనాథం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏడుకొండల ఈకార్యక్రమంలో టిటిడి సివిఎస్ కెవి మురళీకృష్ణ, డిప్యూటీ ఇ.లు భాస్కర్, సోమన్నారాయణ, ప్రశాంతి, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, పిఆర్, నీలిమ ఉన్నారు. టిటిడి ఇఒగా రెండవసారి నియమితులైన అనిల్కుమార్సింఘాల్ వేంకటేశ్వరస్వామిపై భక్తివిశ్వాసాలతో బుధవారం ఉదయం తిరుపతి అలిపిరి నుండి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
నడకదారిలో మధ్యమధ్యలో ఆయనను గుర్తుపట్టిన పలువురు భక్తులు పలకరించి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల అనుభవాలను, సూచనలను తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు నడకదారిలో ఆయన నడచిరావడం విశేషం. గతంలోనూ 1984లో మొదట తిరుమలకు కుటుంబంతో కలసి వచ్చానని, అప్పట్లో స్వామివారి దర్శనం కోసం ఏడుగంటలు ఎదురుచూసి దర్శనం చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. సామాన్యభక్తుడిగా దర్శనం చేసుకున్నపుడు సామాన్యుల బాధలు తెలిశాయని భక్తులతో ముచ్చటించారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: