వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా పరాజయం ఎదురైనా, అనర్థాల మాటలతో విమర్శలు చేయడం బాధాకరమన్నారు. “రాజకీయ ఉనికికోసం ఇష్టం వచ్చినట్లు నన్ను విమర్శిస్తున్నారు. అవాస్తవాలపై ఆరోపణలు చేయడం శ్రేయస్కరం కాదు,” అని దుర్గేష్ ఘాటుగా స్పందించారు. తాను ఇసుక వ్యాపారం చేశానని పేర్ని నాని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
ఇసుక వ్యాపారంపై సవాల్ విసిరిన మంత్రి
“నిజంగా నేను ఇసుక వ్యాపారం చేశానని మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి. నిరూపించగలిగితే రాజకీయం విడిచేస్తా” అంటూ మంత్రి కందుల దుర్గేష్ సవాల్ విసిరారు. అలాగే రేషన్ బియ్యం విషయంలో జరుగుతున్న విచారణకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ, ‘‘దొంగతనంతో సంపాదించిన డబ్బులతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే దొరలవుతారా?’’ అని పేర్ని నాని (Perni Nani)ని నిలదీశారు. ప్రజల ముందుకు నిజం తీసుకురావాల్సిన సమయంలో తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం బాధాకరమన్నారు.
అధికారం పోయాక పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు: దుర్గేష్
దుర్గేష్ వ్యాఖ్యల ప్రకారం, అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు తల్లడిల్లిపోయారని విమర్శించారు. ‘‘పెర్ని నాని తీరు చూస్తుంటే పిచ్చి పట్టినవాళ్లలాగా ఉంది. అవాస్తవాలపై విమర్శలు చేయడం రాజకీయ నైతికతకే మచ్చ’’ అని ఆరోపించారు. ప్రజలు నిజం ఏంటో తెలుసుకునే స్థితిలో ఉన్నారని, నానీ వంటి నేతల మాటలు నమ్మే రోజులు ముగిశాయని తెలిపారు. పాలనలో పారదర్శకతే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
Read Also ; Jagan Press Meet : రేపు జగన్ ప్రెస్ మీట్