నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, భూసేకరణ వ్యయం, మరియు నిర్మాణ వ్యయాలను తగ్గించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో డబుల్ డెక్కర్ కారిడార్ల నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మరియు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ నూతన విధానంలో, కింద వాహనాల కోసం ఫ్లైఓవర్, పైన మెట్రో రైలు మార్గం ఒకే నిర్మాణంలో చేపట్టడం జరుగుతుంది. ఈ విధానాన్ని ఇప్పటికే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విజయవంతంగా అమలు చేస్తుండగా, ఇప్పుడు ఏపీలోని ఈ రెండు కీలక నగరాల్లో అమలు చేయడానికి అడుగులు పడుతున్నాయి. ఫ్లైఓవర్, మెట్రో లైన్‌ను వేర్వేరుగా నిర్మించకుండా ఒకే ప్రాజెక్టుగా చేపట్టడం వల్ల, NHAI మరియు మెట్రో రైల్ కార్పొరేషన్లకు కలిపి సుమారు రూ. 563 కోట్లు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ డబుల్ డెక్కర్ నిర్మాణం త్వరగా పూర్తి అవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

విశాఖపట్నం నగరంలో, మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా కొమ్మాది నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు 46.23 కిలోమీటర్ల మార్గంలో పనులు చేపట్టనున్నారు. అయితే, ఇదే మార్గంలో ఉన్న జాతీయ రహదారిపై మధురవాడ నుంచి లంకెలపాలెం వరకు 12 కూడళ్ల వద్ద ఫ్లైఓవర్‌లు నిర్మించడానికి NHAI ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేర్వేరు వంతెనలకు బదులుగా, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టాలని NHAIకి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనకు NHAI ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం, విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 16 కిలోమీటర్లు, గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు 4.10 కిలోమీటర్లు—మొత్తం 20.10 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మించనున్నారు.
Breaking news: విమాన రద్దులపై ఇండిగో కీలక స్పష్టం
మరోవైపు, విజయవాడలో కూడా ఇదే తరహా డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ వేగంగా సాగుతుండగా, దీనిని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై డబుల్ డెక్కర్‌గా నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ జాతీయ రహదారిపై మహానాడు కూడలి నుంచి నిడమానూరు వరకు 5.8 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మించడానికి NHAI గతంలో అంగీకరించింది. అయితే, ఇదే లైన్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు మంజూరు కావడంతో, ఈ రెండింటినీ కలిపి 4.33 కిలోమీటర్ల మేర డబుల్ డెకర్ కారిడార్‌గా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ విధంగా ఒకే ప్రాజెక్టుగా చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని, నిర్మాణ పనులు ఏ సంస్థ చేపట్టినా అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తాజాగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/