తిరుమల పవిత్రతను కాపాడటంలో టీటీడీ (TTD) కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ, కొందరు వ్యక్తుల ప్రవర్తన మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దివ్వెల మాధురి తిరుమలలో మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించి వార్తల్లో నిలిచారు. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి పుట్టినరోజు వేడుకలను కొండపై ఉన్న ఒక గెస్ట్‌హౌస్‌లో ఆమె నిర్వహించారు. తిరుమల నిబంధనల ప్రకారం కొండపైకి కేక్‌లు తీసుకురావడం, కట్ చేయడం నిషిద్ధం. అయినప్పటికీ, నిబంధనలను అతిక్రమించి కేక్ కట్ చేయడమే కాకుండా, ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, నిషేధిత వస్తువులు కొండపైకి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేపట్టింది.

దివ్వెల మాధురి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తిరుమల ఆలయ పరిసరాల్లో, మాడ వీధుల్లో రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదుతో ఆమెపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. అప్పట్లో తన తప్పును ఒప్పుకుంటూ, ఇంకోసారి ఇలాంటి పనులు చేయనని క్షమాపణలు చెప్పిన ఆమె, మళ్ళీ అదే రీతిలో ప్రవర్తించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలను వ్యక్తిగత ప్రచారం కోసం వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :