ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంపై వస్తున్న విమర్శలు కొత్తేమి కావని, ఇదే తరహా ఆరోపణలు గతంలో సైబరాబాద్ అభివృద్ధి సమయంలో కూడా వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గుర్తు చేశారు. ఇటీవల ఢిల్లీలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా రాజధాని అభివృద్ధి జరగడం కొందరికి నచ్చట్లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాకు మంచి పేరు వస్తుందన్న అసూయతోనే ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఆయన మాటల్లో నిజం ఉందనేలా గతంలో హైదరాబాద్ అభివృద్ధి సమయంలోనూ అదే తంతు కొనసాగిందని చెప్పారు.కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఒక్క హైదరాబాద్లోనే డబ్బు ఖర్చు చేస్తున్నాడు అని ఆరోపణలు చేశారట. కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేకుండానే ఆ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చాయని, ఇప్పటికీ తెలంగాణ ఆదాయంలో 75% హైదరాబాద్నుంచే వస్తోందని తెలిపారు. అదే తీరులో అమరావతి అభివృద్ధి జరుగుతోందని చెబుతున్నారు.

రైతుల పాత్రే అమరావతి విజయానికి బలం
అమరావతి కోసం 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గర్వంగా చెప్పారు. ఆ భూమిని వాణిజ్యపరంగా ఉపయోగించి ఆదాయం సృష్టించామనీ, నిర్మాణంలో రైతులు భాగస్వాములవ్వడం వల్ల వారికి ఆర్థికంగా లాభం చేకూరుతోందని వివరించారు. రైతులు నేనేన్నాక భూములు ఇచ్చారు, ఇది కొందరికి జీర్ణించట్లేదు. అందుకే విమర్శలు అని వ్యాఖ్యానించారు.చంద్రబాబు మాటల్లో, ఒక ఆలోచన నా మైండ్‌లో పడ్డాక అది కార్యరూపం దాల్చేదాక నా దృష్టి మరలదు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. రాజధాని అభివృద్ధి వల్ల రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
లోకేశ్ రాజకీయాల్లో ఎదుగుతున్న యువ నేత
తన కుమారుడు నారా లోకేశ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. స్టాన్‌ఫర్డ్ నుంచి పీజీ చేసి వచ్చిన తర్వాత ప్రజాసేవ వైపే మొగ్గుచూపారు. రాజకీయాల్లో తన స్థానం తానే సంపాదించుకునేలా కష్టపడుతున్నారు. యువత రాజకీయాల్లోకి రావడం అవసరం అని చెప్పారు. మంచి నాయకులను తయారుచేయడం ముఖ్యం అని అభిప్రాయపడ్డారు.అమరావతి అభివృద్ధిపై వస్తున్న విమర్శలు నిజానికి అభివృద్ధి పట్ల ఉండాల్సిన చింత కాదు. అవి రాజకీయ వ్యూహాలే అని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరావతి రాష్ట్రానికి గొప్ప ఆదాయ వనరుగా మారుతుందని ఆయన ధీమాగా చెప్పారు.
Read Also : AP Nurse : ఏపీ నర్సు శుభావతికి ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం